పథకాలు నీరుగార్చడమేనా బంగారు తెలంగాణ

  • ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టవా?
  • లక్ష ఉద్యోగాలు, కోటి ఎకరాలకు నీరు ఏమయ్యాయి
  • వైయస్‌ఆర్ పథకాలను నీరుగార్చితే ఊరుకోం
  • రైతు రుణమాఫీపై వైయస్‌ఆర్‌ సీపీ ఉద్యమ కార్యచరణ
  • పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజాశ్రేయస్సు కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను నీరుగారిస్తే ఊరుకునేది లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వానికి ఆసుపత్రులు నోటీసులు ఇవ్వడం, ఆసుపత్రులకు ప్రభుత్వాలు అల్టిమేటం ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా అని టీసర్కార్‌ను ప్రశ్నించారు. కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినా రెండున్నర సంవత్సరాల్లోనే ఆరోగ్యశ్రీకి గండిపడిందన్నారు. జూన్‌ నెల వరకు రూ. 430 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయి ఉంటే అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తూ అరకొర నిధులు ఇస్తూ ఆసుప్రతిలకు అల్టిమేటం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహానేత వైయస్‌ఆర్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.  ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని తీసుకువచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. అలాంటి పథకాన్ని కేసీఆర్‌ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 

ఆ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయి
కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలకు సంబంధం లేకుండా గ్రౌండింగ్‌ చేస్తున్న రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నెల నెల రూ. 2100 కోట్లతో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తే ఆ లక్షల కోట్ల ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు రైతులకు నీరు అందేదెప్పుడని  నిలదీశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ. 3.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు, ప్రాజెక్టులు నిర్మాణాలు జరుగుతాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్‌ ఒక్క హైదరాబాద్‌ నగరంలోని పేదలకు లక్ష ఇళ్లు ఇస్తామని చెప్పారు. రెండున్నర ఏళ్లు గడిచింది. ఇప్పటికీ ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేదలు పక్కా గృహాల్లో ఉండాలనే ఆలోచనతో వైయస్‌ఆర్‌ గ్రామసభల ద్వారా అడిగిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. అధిక వర్షాలతో రాష్ట్ర రైతాంగమంతా కష్టాల్లో ఉంటే ఇప్పటికీ కేసీఆర్‌ పంట నష్టంపై సర్వే కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, స్వయంగా తానే వెళ్లి రైతులను పరామర్శించానని గట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే వర్ష బాధిత రైతుల పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

వారినెందుకు టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారో చెప్పాలి
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని కేసీఆర్‌ను గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. జిల్లాల్లో సర్వేలు నిర్వహించుకుంటూ ఎన్ని సీట్లు వస్తాయని కేసీఆర్‌ తెలుసుకుంటున్నారని, సర్వేలు కాదు ప్రజాతీర్పు వచ్చినప్పుడు తెలుస్తుందని హితవుపలికారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పాదయాత్రలు, పోరాటాలు చేస్తే కేసులు పెడతామని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి పలు దఫాలుగా రైతులను ఊరిస్తున్న కేసీఆర్‌ ఒకేసారి మాఫీ చేయాలని కోరారు. రైతు రుణమాఫీకి సంబంధించి వైయస్‌ఆర్‌ సీపీ ఉద్యమ కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పారు. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఒక్క కరెంట్‌ తప్ప అని సంక్షేమాల్లో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. లక్షల ఉద్యోగాలు, కోటీ ఎకరాలకు నీరు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల అంచెనాలను పెంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పుకోవడం మాని ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని సూచించారు. 

Back to Top