పర్యాటక కేంద్రాల్లో తక్షణ చర్యలు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: మండలంలోని ప్రసిద్ధ  పుణ్యక్షేత్రాలైన కసుమూరు మస్తాన్‌వలి దర్గా, గొలగమూడి వెంకయ్యస్వామి దేవాలయాల్లో స్వైన్‌ప్లూపై  వైద్యశాఖ  తక్షణ చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా  సర్వేపల్లి  ఎమ్మెల్యే  కాకాణి గోవర్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గొలగమూడిలో  స్వైన్‌ప్లూ నివారణ మందుల ప్రత్యేక శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  పర్యాటక ప్రాంతమైనందున అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, స్వైన్‌ప్లూ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. గొలగమూడిలో స్వైన్‌ప్లూతో ఒక మహిళ మృతిచెందడం బాధాకరమన్నారు. అధికారులు అప్రమత్తతతో జిల్లాలో మరొకరికి ఈ వ్యాధి సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సులు, కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికి నివారణ మందులు అందజేయాలని కోరారు. శాశ్వత వైద్య శిబిరాలను  ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధి నివారణ పరీక్షలు , వైద్యసేవలు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మాస్కులు  అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ సుగుణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ గుమ్మడి రాజా,  వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శులు  ప్రదీప్‌రెడ్డి,   వెంకటేశ్వర్లు,  సుబ్బయ్యగౌడ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మాధవి కుటుంబానికి పరామర్శ

గొలగమూడిలో స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన కుర్రకూటి మాధవీలత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కుర్రకూటి పార్థసారధికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Back to Top