జీవో 29ని వెంటనే రద్దు చేయాలి

  • విద్య పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న గంటా, నారాయణ
  • పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారడం సిగ్గుచేటు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు
  • విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, జీవో నంబర్‌ 29ని రద్దు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి నిర్వహించారు. సలాంబాబు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నిరసనకారులను అడ్డుకుని, అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ.. మూసివేసిన సంక్షేమ హాస్టల్స్‌ను వెంటనే తెరవాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ స్కూల్స్, కాలేజీలలో రూ. లక్షల్లో ఫీజు దోపిడీ జరుగుతున్నా.. చంద్రబాబు, మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరద్ధంగా విద్యాసంస్థలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు నారాయణ, గంటా విద్య పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. వెంటనే చంద్రబాబు ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టాలన్నారు. 29 జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేలా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపడితే పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
Back to Top