సాగర్ నీళ్లివ్వాలి.. గొట్టిపాటి డిమాండ్

ప్రకాశంజిల్లా (అద్దంకి): సాగర్ నీటిని వచ్చే నెల మార్చి నెలాఖరు వరకు ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రులు రైతులకు ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు సాగర్ నీరు నిలుపుదల చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని 15 లక్షల ఎకరాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 4.20 లక్షల భూముల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వరి చాలా వరకు కోతకు వచ్చే దశలోనూ, మరి కొంత పొట్ట దశలోనూ ఉందని చెప్పారు. ఆ పంటకు నీరు అవసరమైన కీలక సమయం ఇదేనన్నారు. ఈ సమయంలో ఆంధ్ర రైతుల పొలాలకు నీరు నిలిపేయడం నష్టం కలిగించే చర్యగా ఆభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టి, రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి వెంటనే ఏపీకి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు స్పందించకుంటే పోట్లాడైనా నీరు తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాగర్ ఆయకట్టు ఆంధ్రలోనే ఎక్కువగా ఉందన్నారు.

ఆంధ్రలో సుమారు 15 లక్షల ఎకరాల భూములుంటే, తెలంగాణాలో కేవలం 6.5 లక్షల ఎకరాల సాగు భూమి మాత్రమే ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో సాగర్‌పె మన అధికారుల అజమాయిషీ ఉండాలే కాని, తెలంగాణా అధికారుల అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు. వారు చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రెండు సార్లు సాగర్ నీరు ఆగి మరలా విడుదల కావడంతో పంట భూములు ఎండిపోయి బతికాయన్నారు. మరలా రెండు రోజులు నీటి విడుదల నిలిస్తే, కాలువకు నీరు వచ్చే సమయానికి పంటలు ఎండిపోవడం ఖాయమన్నారు. సుబాబుల్ రైతుల బకాయిలు చెల్లించాలి.. గతంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన సుబాబుల్ కర్ర బకాయిలను కంపెనీల నుంచి చెల్లించే విధంగా సంబంధిత మంత్రి చొరవ చూపాలన్నారు. టన్ను గిట్టుబాటు ధర రూ.4400 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమకు కర్ర దొరకని సమయంలో పొగాకు బదులుగా సుబాబుల్ చెట్లు వేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పిన కంపెనీ ప్రతినిధులు నేడు కర్ర అధికంగా లభిస్తుండడంతో ధరను తగ్గించే ప్రయత్నాలను చేయడం మంచి పద్దతి కాదన్నారు.
Back to Top