మహిళలను గౌరవించడం నేర్చుకోండి

  • ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు తగదు
  • పోలీసులకు వైయస్‌ఆర్‌ సీపీ కార్పొరేటర్‌ పుణ్యశీల హితబోధ
విజయవాడ: పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఇష్టారాజ్యంగా పచ్చచొక్కాల ముసుగులో మాట్లాడొద్దని, ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ కార్పొరేటర్‌ పుణ్యశీల హితబోధ చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడిన తీరు తేళ్లు, జ్రరులు పాకినట్లు ఉందని రక్షణ కల్పించే పోలీసు అధికారులు అనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పబ్లిక్‌ సర్వెంట్స్‌ ఒక మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. విజయవాడ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... పోలీసు అధికారులు ఎమ్మెల్యే రోజాపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

ఎయిర్‌పోర్టులో నిర్భందించి దాదాపు 8 గంటల పాటు రోజా ఆచూకీ కూడా చెప్పకుండా పోలీసులు డ్రామా ఆడారని మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్వయాన కోడలు మీడియా ముందుకు వచ్చి నాకు ఇంట్లో రక్షణ లేదు అంటే, ఓ మహిళ ఆవేదనను అర్థం చేసుకొని ఎమ్మెల్యే రోజా పోరాడిందన్నారు. ఆ పోరాటాన్ని రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌గా తీసుకొని ఆమెను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. ఎమ్మెల్యే రోజా పోలీసుల చర్యతో మనస్థాపానికి గురైంది కాబట్టే పోలీసులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిందన్నారు. ఇందులో తప్పేముందని పోలీస్‌ శాఖను ప్రశ్నించారు. 

మహిళా పార్లమెంటరీ సదస్సులో స్పీకర్‌  చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళాలోకం క్వశ్చన్‌ చేయబట్టే స్పీకర్‌ దిగివచ్చి క్షమాపణ చెప్పారని పోలీసులకు గుర్తు చేశారు. ఓ ఎస్సై తనను మోసం చేశాడని ఓ మహిళ మీడియా ద్వారా బయటకొచ్చింది. ఆమె విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకున్నారని డీజీపీని నిలదీశారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్‌ అధికారులపై ముఖ్యమంత్రి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top