బడ్జెట్ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లన్నింటినీ బహిరంగపర్చాలి

హైదరాబాద్: అధికారపక్షానికి నిజంగా నిజాయితీ, దమ్మూ ధైర్యం ఉంటే శాసనసభ బడ్జెట్ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లన్నింటినీ(మొత్తం దృశ్యాలను) బహిరంగపర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్.కె.రోజా, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సవాలు విసిరారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి సంబంధించిన కేవలం అరగంట వీడియాను విడుదల చేస్తే సరిపోదని, అధికారపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును కూడా ప్రజల ముందుకు తేవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ వ్యవహారాల్లో ఎవరు తప్పుగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవాలని, తాము తప్పు చేసి ఉన్నా, అధికారపక్షం తప్పుచేసినా బాధ్యులను చేయాలని కోరారు. మొత్తం వీడియో క్లిప్పింగ్‌లను ఇవ్వాలని తాము స్పీకర్‌కు లేఖ ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. ‘‘అసలు ఈరోజు(బుధవారం) టీడీపీ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు విడుదల చేసిన క్లిప్పింగ్ ఎలా బయటికొచ్చింది. స్పీకర్ ఇచ్చారా..? లేక ప్రసారహక్కులున్న ఏబీఎన్ చానల్ వారు టీడీపీకిచ్చారా? స్పీకర్ ఇచ్చిఉంటే ఆయన సమాధానం చెప్పాలి... ఏబీఎన్ చానల్ ఇచ్చి ఉంటే వారిపై చర్య తీసుకోవాలని కోరతాం’’ అని ఎమ్మెల్యేలు చెప్పారు.

అసలు ‘లైవ్’లోకి రాని దృశ్యాల చిత్రీకరణను బయటకు విడుదల చేశారంటే టీడీపీ వారి దురుద్దేశమేమిటో తెలిసిపోతోందన్నారు. అసెంబ్లీ సొత్తు అయిన దృశ్యాల క్లిప్పింగ్‌లు ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారని, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. ఇరువైపులా ఏం జరిగిందో ఆ దృశ్యాలను విడుదల చేస్తే తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎలా ఉసిగొల్పుతున్నారో... చేతులతో సంజ్ఞ లు చేస్తూ ప్రతిపక్షంపైకి వెళ్లండి అని ఎలా చెబుతున్నారో స్పష్టంగా తెలుస్తుందని వారన్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో చాలా దిగజారి వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షానికి అసలు మాట్లాడే అవకాశమే లేకుండా అడ్డుపడుతున్నారని వారు చెప్పారు.
Back to Top