బాధితులతో కలిసి గిరజాల నిరసన

రాజమహేంద్రవరం రూరల్‌: కొంతమూరు జంగాలకాలనీలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు పది రోజుల్లో ఇళ్లు నిర్మిస్తామని జీవో రాని పక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ధర్నా చేపడతామని ఆ పార్టీ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ గిరజాల వీర్రాజు (బాబు) హెచ్చరించారు. రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆయన బాధితులతో కలసి నిరసన చేపట్టారు. గిరజాలబాబు మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు పది నెలలు అయినా ఇప్పటివరకు ఎటువంటి ఇళ్లు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు పాకల్లోను, విషసర్పాల మధ్య జీవనం సాగించాల్సి వస్తోందన్నారు. అగ్నిప్రమాదసమయంలో ఎంపీ మురళీమోహనర్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అది ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బాధితులతో పాటు అక్కడ ఉన్న 144 మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీఓ రమణారెడ్డి, తహసీల్దార్‌ కె.పోసయ్యలకు బాధితులతో కలసి గిరజాలబాబు వినతిపత్రం అందజేశారు.

తాజా ఫోటోలు

Back to Top