బాబుపై దండయాత్రకు సిద్ధంకండి

  • కమీషన్లు, సెటిల్‌మెంట్లతో గడిపేస్తున్న బాబు
  • విషజ్వరాలను గుర్తించలేని గుడ్డి ప్రభుత్వం
  • 600ల వాగ్ధానాలతో అన్ని వర్గాలకు మోసం చేశాడు
  • ప్రజా ఉద్యమానికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది
  • వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: ఎన్నికల్లో చంద్రబాబు హామీలతో మోసపోయిన ప్రజలంతా దండయాత్రకు సిద్ధం కావాలని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోసపోయిన వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి ఏకమై ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. ప్రజలకు వెన్నదన్నుగా, అండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం భూమన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలక్రితం రాష్ట్రంలో కరువు ఇనుప గజ్జెలు వేసుకొని విలయతాండం చేస్తుంటే ఇంత కరువుందని నాకు ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ చెప్పలేదని చెప్పారన్నారు. అదే విధంగా మళ్లీ ప్రకృతి విలయతాండవం చేస్తుంటే, పంటలు, రైతాంగం, ప్రజలు వరదలతో కూలారిల్లిపోతుంటే మేల్కొని సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాకెవ్వరూ చెప్పలదు అని బాధపడకుండా ముందుగానే తెలియజేస్తున్నామని బాబుకు చురకంటించారు. ఒకవైపు ప్రకృతి అల్లకల్లోలం సృష్టిస్తుంటే మరోవైపు ప్రభుత్వం మరో కల్లోలం సృష్టిందన్నారు. ఎన్నికల్లో గెలవవడం కోసం 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా వాగ్ధానభంగం చేసిన చంద్రబాబుపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అధికారంలోకి వచ్చాక హామీలను మర్చిపోయిన చంద్రబాబుపై తిరగబడాల్సిన అవసరం ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో మనకిచ్చిన పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని ప్రజలకు సూచించారు. ఇచ్చిన మాటను నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా మోసం చేశారని పేర్కొన్నారు. బాబు మోసాలతో భవిష్యత్తులో ఏ నాయకుడిని నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడానికి కేంద్రం కాళ్లమీద పడి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తుని ఘటనలో తనను ఇరికించాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  చంద్రబాబు హామీలతో మోసపోయిన ప్రజలు ఎదిరించాలని ప్రతి ఒక్కరిని స్వయంగా తానే అభ్యర్థిస్తానని పోరాటం గాంధీ మనకు ఇచ్చిన హక్కు స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని బాబుపై పోరాటాలు చేయాలన్నారు. 

బాబును ధిక్కరిద్దాం
చంద్రబాబు ఎన్నికల హామీలతో గాయపడ్డ కాపు కులస్థులు బాధతో ఒక్కతాటిపై నిలబడి ఉద్యమించిన వారందరికీ భూమన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కాపులంతా ఎలా ఒక్కటై పోరాడారో.. అదే రీతిలో ఎన్నికల హామీలు నెరవేర్చే విధంగా దిక్కరించాలని ప్రజానికానికి పిలుపునిచ్చారు. గెలుపుకోసం వందల వాగ్ధానాలిచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని మండిపడ్డారు.  రైతాంగానికి రుణాలన్ని మాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నంపడానికి రూ. 87 వేల కోట్లు రుణాలు బేషరతుగా రద్దు చేస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీకి రైతులంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అదే విధంగా డ్వాక్రా మహిళలు చేసిన అప్పులతో మెరుగైన జీవితం గడపలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత రుణాలు, బ్యాంక్‌లోని బంగారం విడిపిస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్ధానం నెరవేర్చకునేందుకు చంద్రబాబుపై డ్వాక్రా మహిళలు దండయాత్ర చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తిస్తామని, కురువ, రజకులను ఎస్సీలుగా మార్చుతామని ఓట్లేయించుకొని మోసం చేశారన్నారు. బీసీ బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని, ఉద్యోగాల్లో, ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పిస్తామని బాబు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కినందుకు రాష్ట్రంలోని వెనుకబడిన కులాలన్నీ తిరగబడటానికి సమాయత్నం కావాల్సిన తరుణం ఏర్పడిందన్నారు. బీసీలంతా ఏకమై ఒక్కతాటిపై నినదించాలని, మీ గళం ముందు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అడగక ముందే హామీలిచ్చి వాగ్ధానాలకు భంగపర్చినందుకు తిరగబడాలన్నారు. ట్యాక్స్, ఆటోడ్రైవర్‌లకు వడ్డీలేని రుణాలు అందించి వాళ్లకు వాహన కొనుగోలు సౌకర్యం కల్పిస్తామని చెప్పి కార్మికులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను మర్చిపోయిన చంద్రబాబుపై దండయాత్ర చేయాల్సిన హక్కు మనకుందని ప్రజలకు వివరించారు. విద్యార్థులకు ఉచిత కంప్యూటర్‌లు, సైకిల్స్, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు పర్చలేదన్నారు. ఒకప్పుడు విద్యార్థి సంఘాలంటే గడగడా వణికిపోయేవని, చంద్రబాబు వల్లే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా పోయాయని స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాలకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఉద్యమం చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు నూటికి నూరుపాళ్లు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అవకాశాలు వచ్చేంతవరకు నెలకు రూ. 2వేల చొప్పున భృతి కల్పిస్తామని చెప్పిన యువతను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల వాగ్ధానం నెరవేర్చనందుకు యువత మేల్కొని ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేదేమీలేదని సూచించారు. గిరిజనులకు, దళితులకు, బ్రాహ్మణులకు రూ. 500 కోట్లు ఇస్తానని కేవలం రూ. 5 కోట్లు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ఫైరయ్యారు. అన్ని వర్గాల జీవితాలను సుఖప్రదం చేస్తా, అనుభవజ్ఞుడనని మాయమాటలు చెప్పి ప్రజల జీవితాలను చీకటిమయం చేసినందుకు తిరగబడాలని పిలుపునిచ్చారు. ప్రజలు చేసే పోరాటాల వెనుక వైయస్‌ఆర్‌ సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. 

అవసరాలను గుర్తించి వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ
ప్రజల అవసరాలను గుర్తించి మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైయస్‌ఆర్‌దని భూమన గుర్తు చేశారు. చంద్రబాబుది దుర్మార్గపు పాలన అని 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోకి ప్రజలు నెట్టేశారన్నారు. వందల హామీలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ మర్చిపోయిన చంద్రబాబుకు గుర్తు చేయాల్సిన అగత్యం ప్రజలకు, ప్రతిపక్షాలకు ఏర్పడిందన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, మీమేమీ గొంతెమ్మ కోర్కేలు కోరలేదని బాబుకు చురకంటించారు. అధికారంలోకి వచ్చాక సెటిల్‌మెంట్లు, భూదందాలు, కమీషన్లతోనే కాలం గడుపుతున్నారన్నారు. అధికారంలో అతివిలువైన పరిపాలనను పూర్తిగా మర్చిపోయారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. రెయిన్‌గన్, తుని కేసులో వైయస్‌ఆర్‌ సీపీ ఉందని కక్షలు కట్టడం మాని ఇప్పటికైనా ప్రజాజీవనంపై స్పందించాలన్నారు. దోమలపై దండయాత్ర చేయాలని బాబు పిలుపునిచ్చారు. కానీ అసలు పోరాటం చేయాల్సింది బాబుపై అని ఎద్దేవా చేశారు. విషజ్వరాలతో టీడీపీ ఎమ్మెల్యేలు అనారోగ్యపాలువుతున్నా గుర్తించలేని గుడ్డిప్రభుత్వం చంద్రబాబుదని హేళన చేశారు. 
 
Back to Top