మా గీత‌లు మార్చండ‌న్నా..



 

విజయనగరం : టీడీపీ పాలనలో మా బతుకులు మరీ దుర్భరంగా మారాయి.. తాటి, ఈత కల్లు అమ్ముకుని జీవించే మాకు కనీసం ఇళ్లు కూడా లేవు. శ్మశానంలో పూరి గుడెసెలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం.. ఉపాధి లేక అవస్థలు పడుతున్నాం.. హుద్‌హుద్‌ సమయంలో వందలాది ఈత, తాటిచెట్లు నేలకొరిగాయి... అప్పట్లో గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం.. పరిహారం మంజూరు చేస్తామని హామీలు గుప్పించిన నాయకులు మా వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా నష్టపోయాం.. ఆనాడు రాజన్న చల్లని చూపుల్లో ప్రశాంతంగా జీవించాం.. మళ్లీ మాకు రాజన్న పాలన కావాలి.. అందుకే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలని నిర్ణయించుకున్నామని గీత కార్మికులు తెలిపారు. జ‌గ‌న‌న్న సీఎం అయితే మా గీత‌లు మారుతాయ‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

సోమ‌వారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో క‌ల్లు గీత కార్మికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఈ సంఘం నాయ‌కులు మాట్లాడుతూ.. హుద్‌హుద్‌ సమయంలో నష్టపోయిన ప్రతీ ఒక్క కార్మికుడికి (రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తి) రూ. 10 వేల పరిహారం ఇస్తామన్న చంద్రబాబు ఆ ఊసే మరిచిపోయాడన్నారు. మండలంలో 80 మంది రిజిస్ట్రేషన్‌ గీత కార్మికులు ఉన్నామని, పరిహారం కోసం విజయవాడ వెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రూ. లక్ష సబ్సిడీతో రెండు లక్షల రూపాయల రుణం ఇస్తామని టీడీపీ నాయకులు చెప్పడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని, అలాగే ద్విచక్ర వాహనాలు ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని వాపోయారు. మా గీత మారాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని గీత కార్మికులు కోరుకుంటున్నారు.    
Back to Top