నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం


 హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయ లబ్ధి కోసం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొస్తుందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి  అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సీఎం కేసీఆర్‌ తీసుకున్న అనేక నిర్ణయాలను ఉన్నత న్యాయస్థానాలు తప్పుపడుతూనే వస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా అనేక సభల్లో తండాలను, గూడేలను పంచాయతీలుగా మారుస్తానని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ హమీని మరచి ప్రజల దృష్టిని మరల్చటానికి పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని హడావుడి చేస్తున్నారని తెలిపారు. కొత్త చట్టంతో సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకోవాలనుకోవడం క్యాంపు రాజకీయాలకు, ధన రాజకీయాలకు తెర లేపటమే అవుతుందన్నారు. సర్పంచ్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటేనే బాగుంటుందన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో కో–ఆప్షన్‌ సభ్యులను నియమించవద్దని, ఒకవేళ నియమిస్తే వారికి ఓటు హక్కు కల్పించవద్దని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సూచించింది.

Back to Top