నాటకాన్ని బాగా రక్తి కట్టించిన కిరణ్, బాబు

హైదరాబాద్:

ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు నాటకాన్ని కలిసికట్టుగా బాగా రక్తి కట్టించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. ఈ బిల్లులో లోపాలున్నాయని కిరణ్ ‌అసెంబ్లీలో ఇప్పుడే చెప్పడం, ఆయన చెప్పే వరకూ ఈ విషయం తెలియనట్లు చంద్రబాబు నటించడం రసవత్తరంగా ఉందని వ్యాఖ్యానించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు శనివారం మీడియాతో సమావేశంలో మాట్లాడారు.

గత సంవత్సరం డిసెంబర్ 13న రాష్ట్రపతి నుంచి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వచ్చిన బిల్లుపై సీఎం సత్వరమే సంతకం చేసి అసెంబ్లీకి పంపడమంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగిందని గట్టు గుర్తుచేశారు. బిల్లులో లోపాలున్నట్లు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఆ రోజే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉన్న బిల్లుపై చర్చ జరగరాదని, చర్చలోకి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌తొలి నుంచీ చెబుతున్నా పట్టించుకోలేదన్నారు.

ఇంత కాలంగా మౌనంగా ఉండి ఇది ముసాయిదా బిల్లు అని ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం వింతగా ఉందని గట్టు విమర్శించారు. తాను రాసిన లేఖకు కేంద్ర హోంశాఖ నుంచి జనవరి 6న వచ్చిన సమాధానంలో ఇది ముసాయిదా బిల్లు మాత్రమే అని ఉన్నదని అసెంబ్లీలో కిరణ్ చెప్పార‌ంటూ అలాంటప్పుడు ఇప్పటివరకూ ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఇది ముసాయిదా బిల్లు అని తెలిసినపుడు అనవసరంగా ఇన్ని రోజులు ఎందుకు చర్చించారన్నారు. ఈ చర్చ అంతా వృథా కదా అన్నారు.

ఢిల్లీ స్క్రిప్టు ప్రకారమే కిరణ్, బాబు వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టమని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి బిల్లు రాక ముందే గత డిసెంబర్ 12నే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం చేయాలని నోటీ‌పె ఇస్తే పట్టించుకోలేదని, ఆ తరువాత 16న విభజన బిల్లును రాష్ట్రపతికి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులు ఇచ్చినా స్పందించలేదని గుర్తు చేశారు. మళ్లీ ఈ నెల 24 శ్రీమతి విజయమ్మ వాటన్నింటినీ గుర్తుచేస్తూ స్పీకర్‌కు మరో లేఖ కూడా రాశారని, వాటి ప్రతులను గట్టు మీడియాకు చూపించారు. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారని  ప్రశ్నించారు. బిల్లులో తప్పులుంటే బీఏసీ సమావేశాలకు కిరణ్, చంద్రబాబు ఎందుకు రాలేదని గట్టు నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top