భారీ మెజారిటీతో శోభమ్మకు నివాళి చెబుదాం

హైదరాబాద్:

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత భూమా శోభా నాగిరెడ్డి పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... ఆమెకు భారీ మెజారిటీ తీసుకొచ్చి ప్రజలు నివాళి అర్పిస్తారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. శోభమ్మ లేకపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఆళ్లగడ్డ ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత రకరకాల అసత్య ప్రచారాలు జరిగాయి. శోభమ్మ పేరును బ్యాలెట్‌ నుంచి తొలగిస్తారని, ఆమె పేరున్నప్పటికీ... పడిన ఓట్లన్నీ నోటా కింద లెక్కిస్తారని ఇలా రకరకాల అసత్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత‌ ఇచ్చింది. ఎన్నికల్లో శోభ పేరుంటుందని, శోభకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమె గెలిచినట్లుగా ప్రకటించి, ఆ తర్వాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది’ అని గట్టు‌ రామచంద్రరావు మీడియాకు వివరించారు.

Back to Top