బాబు బినామీ సుజనా అరెస్టుకు డిమాండ్

హైదరాబాద్:

చంద్రబాబు నాయుడు బినామీ సుజనాచౌదరి అవినీతి బాగోతాలు స్పష్టంగా వెల్లడైనందున ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సుజనా చౌదరిని ‌విచారిస్తే చంద్రబాబు అవినీతికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడవుతాయన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. మారిషస్‌లోని కమర్షియల్ బ్యాంక్‌కు సుజనా చౌదరి రూ.120 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన వైనాన్ని వివరించారు. సుజనా చౌదరి అక్రమాల నేపథ్యంలో ఆయన బ్యాంక్ ఖాతాలతో‌ పాటు, ఆఫీసు ఫర్నీచర్‌ను సైతం జప్తు చేయాలని హైదరాబాద్ సిటీ సివి‌ల్‌ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు.

‘సుజనా చౌదరిపై కేసు వేసింది భారతీయుడు కాదు. మారిషస్‌కు చెందిన వ్యక్తి వచ్చి హైదరాబాద్‌లో కేసు వేస్తే... న్యాయస్థానం ఏకంగా ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. అంటే మారిషస్‌లోని కోర్టులు ఈ పాటికే ఉత్తర్వులు జారీచేసి ఉంటాయి. అందుకే ఇక్కడి న్యాయస్థానాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి’ అని రామచంద్రరావు చెప్పారు. చంద్రబాబు అనే అవినీతి విషవృక్షం ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుందని గట్టు దుయ్యబట్టారు. బ్యాంక్‌లను మోసం చేయడం, నల్లడబ్బును విదేశాలకు తరలించడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి నిత్యం ఇవే పనులలో బిజీగా ఉంటారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు నాయుడి హయాంలో 65 ప్రభుత్వ సంస్థలను తెగనమ్మడంతో పాటు రహేజా, ఐఎంజీ భారత‌ వంటి సంస్థలకు వందలాది ఎకరాల భూములు కేటాయించి, కమీషన్‌లుగా వేలాది కోట్లు విదేశాలకు తరలించారని గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడగానే వాటిని హవాలా రూపంలో దేశంలోకి తీసుకొచ్చి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హసన్‌ అలీ అనే హవాలా వ్యాపారి స్వయంగా చంద్రబాబు పేరు చెప్పకనే చెప్పారని గుర్తుచేశారు. సుజనాచౌదరి కాలర్ పట్టి లాగితే చంద్రబాబు అవినీతి విషవృక్షం బయటపడుతుందన్నారు.

Back to Top