గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి

వైయస్ఆర్ కడప:  వైయస్‌ఆర్‌ జిల్లాలోని గండికోట నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  మంగళవారం కడప నగరంలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు గండికోట నిర్వాసితులకు తగ్గించిన రూ.లక్ష నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు.  అంబేద్కర్‌ విగ్రహం ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ... గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఉన్నట్టు ఉండి నీరు వదలడం దారుణమన్నారు. ఆసలే భూములు, ఇళ్లు  కోల్పోయి వున్న నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని నీటిని సైతం లెక్క చేయకుండా రాత్రి పగలు అందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడ చేయలేదన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముంపు భాధితులకు పూర్తి స్దాయిలో నష్టపరిహారం చెల్లించకుండా అందోళనలు చేసినందుకు కక్షపూరితంగా లక్ష రూపాయలు కోత విధించడం దారుణమన్నారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులపై ఇలాంటా చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. 

పోలవరం, పట్టిసీమ భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.19 లక్షలు చెల్లించి, పునారావాసం సైతం కల్పించిన చంద్రబాబు గండికోట నిర్వాసితులకు ఎకరాకు రూ. 6లక్షలు మాత్రమే ప్రకటించి కోతలు విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం హేయనీయమైన చర్య అన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 2006లో ఇచ్చిన పరిహారం తప్ప టిడిపి ప్రభుత్వం అధికారంలోకి దాదాపు మూడు సంవత్సరాలైన నిర్వాసితులకు న్యాయం చేయకపోవడం మోసం చేయడమేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాజెక్టుల కోసం రైతులకు ఎటువంటి నష్ట పరిహారం చెల్లించకుంటే భూములు ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 2003 భూసేకరణ చట్టం జిఓ ప్రకారం కోత విధించిన లక్ష రూపాయల నష్ట పరిహారాని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top