రైతుల జీవితాలతో చెలగాటమా..?

పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన
రైతులకు పైసా పరిహారం ఇవ్వని టీడీపీ
ప్రభుత్వ తీరుపై జననేత ఆగ్రహం
రైతులను ఆదుకోవాలని డిమాండ్

వైఎస్సార్ జిల్లా(నల్లపురెడ్డిపల్లి): టీడీపీ సర్కార్ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటనష్టం జరిగినప్పుడల్లా అధికారులు వచ్చి లెక్కలు రాసుకొని పోతున్నారు తప్ప ప్రభుత్వం రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో భాగంగా నల్లపురెడ్డి పల్లిలో అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

తుఫాన్, కరవుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన అధికార టీడీపీ పైసా కూడా చెల్లించడంలేదని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 2013-14కు సంబంధంచి రూ. 1692 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీకి లెక్కలు గట్టారని, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. 2014-15కు సంబంధించి రూ.1500 కోట్లు లెక్కలు గట్టారని...కేబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని వేయి కోట్లకు తగ్గించారని, మరోసారి 600 కోట్లకు తగ్గించారని అన్నారు. ఆ ఇచ్చేది కూడా సరిగా ఇవ్వకుండా రూ. 100 కోట్లు పెండింగ్ పెట్టారని చెప్పారు. 2015-16 లో తుఫాన్ ,కరవుకు సంబంధించి వేయి కోట్ల మేరకు  లెక్కలు కట్టారని, కానీ ఇంతవరకు ఒక్కరూపాయి కూడా రైతులకు అందించిన దాఖలాలు లేవని వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.  

ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందన్న ఆశలు కూడా లేవని రైతులు అంటున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.  ప్రజలకు నమ్మకం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈప్రభుత్వం  పనిచేస్తుందంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు.  మానవతాదృక్పథంతో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.  రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై  ఒత్తిడి తీసుకొస్తామని,  ముఖ్యమంత్రికి లెటర్ రాస్తామని వైఎస్ జగన్ అన్నారు.  జరిగిన ఘటనపై ప్రభుత్వంమీద  ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీ పాత్ర కూడా పోషించాలంటూ విలేకరులను కోరారు. 

ఒక్క నల్లపురెడ్డి పల్లి అనే గ్రామంలోనే  600 ఎకరాల్లో అరటి పంట నష్టపోయిందని వైఎస్ జగన్ చెప్పారు. ఒక ఎకరా అరటి సాగుకు 80 నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుందని....నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కనీస సాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చినా కూడా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఇస్తారన్న నమ్మకం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  బొప్పాయి పంటకు సైతం అదే పరిస్థితి ఉందని చెప్పారు.  పరిహారం రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 

తక్షణమే  రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేవిధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. అదేవిధంగా అరటికి సంబంధించి రైతుల దగ్గర నుంచి ఎకరాకు 5 వేల ప్రీమియం తీసుకొని, ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పంటల బీమా జిల్లా యూనిట్ గా కాకుండా గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని లెక్కగట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే... అవసరమైతే రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలో కూర్చుంటానని జననేత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top