గడప గడపకూ జనం ఆకాంక్షను చాటాలి

మంచిర్యాల :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఏడు నెలలుగా జైల్లో ఉంచడాన్ని నిరసిస్తూ ‘జగన్ కోసం.. జన సంతకాలు’ సేకరించాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ జిల్లా నేతలకు సూచించారు.  పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ మేకల ప్రమీల, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కాంపల్లి సమ్మయ్య, సిర్పూర్(టి)కి చెందిన జిల్లా నాయకుడు షేక్ చాంద్‌లతో  టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జగన్ కోసం.. జన సంతకాలు’ కార్యక్రమంలో ఓటర్ల నుంచే కాకుండా యువకులు, చిన్న పిల్లల నుంచి సంతకాలు సేకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా  సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించడం ద్వారా జగన్ విడుదలపై ప్రజల్లో ఉన్న ఆకాంక్షను రాష్ట్రపతికి తెలియజేయాలన్నారు. నియోజకవర్గాల పరిధి లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలు సేకరించాలని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని చెప్పారు. దివంగత మాహానేత డాక్టర్ వైయస్ఆర్  అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జిల్లా నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు ఉన్న ఆకాంక్షను తెలపాలని పేర్కొన్నారు.

Back to Top