జిల్లాలో ఆంక్షలపై ఆగ్రహం

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు విధించడాన్ని వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె. కన్నబాబు తప్పుబట్టారు. జిల్లాలో ఎక్కడికక్కడ నియంత్రణలు విధించడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేర్చమని అడిగితే పోలీసులతో నిర్బంధం విధిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ముఖ్యమంత్రి ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు.

పాలకులు ఏం చేసినా అందరూ నోరు మూసుకుని కూర్చోవాలా అని గట్టిగా కడిగిపారేశారు. శాంతి భద్రతల పేరిట ప్రతి ఒక్కరిని అనుమానించడం దారుణమని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, దాన్ని కాలరాయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కాపు సత్యాగ్రహ యాత్ర, ప్రత్యేక హోదా పోరు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Back to Top