సమైక్య శంఖారావానికి గట్టి పోలీసు భద్రత

హైదరాబాద్, 23 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఈ నెల 26న ఈ సభను నిర్వహిస్తున్నారు. సమైక్య శంఖారావం సభకు అంచనాలకు మించి అభిమానులు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు.

మరో పక్కన సభను అడ్డుకోడానికి కొందరు తెలంగాణ వాదులు ప్రయత్నిస్తున్నట్లు కూడా సమాచారం అందడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 16 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 1,800 మంది సివిల్ పోలీసులతో పాటు నగరంలోని పలు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బందిని కూడా భద్రత కోసం ఏర్పాటుచేస్తున్నట్లు నగర పోలీసు కమిషన‌ర్ అనురా‌గ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము పూర్తి జాగ్రత్తలు తీసుకుటున్నట్లు ఆయన వివరించారు.

‌సమైక్య శంఖారావం సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు ‌పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 శనివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి ముందు నుంచే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నారు. ఈ సమైక్య శంఖారావం సభ ద్వారా ఢిల్లీ గల్లీల్లో కూడా సమైక్య ఆకాంక్షను బలంగా వినిపిస్తామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు ‌పేర్కొటున్నారు.

Back to Top