అడుగడుగునా విజయమ్మ వాహనం తనిఖీ

కాకినాడ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పట్ల తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరోసారి అవమాన‌కరంగా వ్యవహరించారు. 2012లో ఉపఎన్నికల సందర్భంగా ఇదే జిల్లాలో రెండు ప్రాంతాల్లో వాహనాలతో పాటు శ్రీమతి విజయమ్మ సూట్‌కేసులను మగ పోలీసులు తనిఖీ చేయగా, మళ్లీ అదే రీతిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రామచంద్రాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీమతి విజయమ్మ బసచేసే వాహనాన్ని తనిఖీ చేసే విషయంలోను పోలీసులు అతిగా వ్యవహరించారు. కోలంక వద్ద బస్సును తనిఖీ చేసే పేరుతో కె.గంగవరం ఏఎస్‌ఐ సత్యనారాయణ హంగామా చేశారు.

విశేష ప్రజాదరణ ఉన్న పార్టీకి గౌరవ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే అ‌నే విషయాలను కూడా పట్టించుకోకుండా వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో ఆ సమాచారాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. మళ్లీ తనిఖీ చేయమని వారు ఆదేశించడంతో పోలీసులు దంగేరువద్ద మరోసారి హడావుడి చేశారు. భోజన విరామ సమయంలో శ్రీమతి విజయమ్మ బసచేసే బస్సును మరోసారి తనిఖీ చేశారు.

మహిళలకు సంబంధించి ఎలాంటి తనిఖీలనైనా విధిగా ఆడ పోలీసులతో మాత్రమే నిర్వహించాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు పాటించలేదు. పైగా, దంగేరులో తనిఖీ సమయంలో ఏఎస్‌ఐ ఒక్కరే అణువణువూ పరిశీలించారు. పోలీసుల వైఖరిపై  వైయస్ఆర్ అభిమానులు మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు,‌ చిరంజీవి, జైరాం రమేశ్ వంటి నేతలు జిల్లాలో పర్యటించినప్పుడు ఎలాంటి తనిఖీలూ చేయకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Back to Top