అధికారమదంతో పత్రికాస్వేచ్ఛకు పోటు

 • పాలనలో టీడీపీ పూర్తిగా వైఫల్యం
 • మదబలంతో అధికార దుర్వినియోగం
 • హామీలను విస్మరించి అవినీతి పాలన
 • ప్రజలను పక్కదారి పట్టిస్తున్న వైనం
 • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన పార్థసారథి

 • విజయవాడః చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను విస్మరించి ప్రజలను పక్కదారి పట్టించేవిధంగా పాలన సాగిస్తున్నాడని వైయస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారథి మండిపడ్డారు. హోదా సాధించడంలో గానీ, పోలవరానికి, రాజధానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోగానీ, మేనిఫెస్టోలో పెట్టిన వాగ్ధానాలు నెరవేర్చడంలోగానీ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఇవన్నీ మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా.... కోట్లాది రూపాయలు ఆశచూపి ఎమ్మెల్యేలను కొనడంతోనే ఘనవిజయం సాధించినట్లు బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో  విలేకరుల సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. 

  ఓవైపు  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ...ఇంకోవైపు మందబలంతో పోలీసులను ఉపయోగించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పత్రికాస్వేచ్ఛకు పోటు పొడుస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళుతుందన్న ఉద్దేశ్యంతోనే... చంద్రబాబు అధికారమదంతో సాక్షి ప్రసారాలను నిలుపుదల చేశారని విమర్శించారు. ప్రసారాలు నిలుపుదల చేయడం తప్పని తెలిసినా, ప్రభుత్వాన్ని ఎదురించలేక అలా చేయవల్సి వచ్చిందని ఎమ్మెస్ వోలు అంటున్నారంటే పరిస్థితి  ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుందని పార్థసారథి నిప్పులు చెరిగారు. వీటన్నంటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని  పార్థసారథి పత్రికా సోదరులను కోరారు. 

  కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించడంలో వైఫల్యం, రాజధానిలో భూముల కుంభకోణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిధులు తేవడంలో వైఫల్యం, ఇరిగేషన్ వైఫల్యం సహా తెలుగుదేశం వైఫల్యాలపై రేపు విజయవాడలో జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు పార్థసారథి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి నష్టం చేకూర్చేలా కృష్ణా,గోదావరిలపై అక్రమ ప్రాజెక్ట్ లు కడుతున్నా...టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో చేతులు ముడుచుకొని చోద్యం చూస్తోందే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదని పార్థసారథి మండిపడ్డారు. 

  ఇసుక మాఫియా, నీరు-చెట్టు దోపిడీ, వేల కోట్ల విలువ చేసే దేవుడి భూముల్ని 22 కోట్లకు అప్పనంగా ధారాదత్తం చేశారు. రాజధానిలో రైతుల భూములు దోచుకొని వారి పొట్టగొట్టారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇస్తూ చంద్రబాబు అడ్డంగా పట్టుబడ్డారు. ఏపీలో ఒక్కొక్కరికి రూ.30 కోట్లు వెదజల్లారు.  ఇలా చంద్రబాబు సర్కార్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని  పార్థసారథి ఫైరయ్యారు. వీటన్నంటిపైనా రేపటి సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తుంటే...దానికి సమాధానం ఇవ్వకుండా తమపై ఎదురుదాడికి  దిగుతున్నారని ఫైరయ్యారు. అవినీతి జరగకపోతే చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. 


Back to Top