ప్రజాసమస్యలపై దృష్టి..పార్టీ బలోపేతం కోసం కృషి

చిత్తశుద్ధితో పనిచేయాలి
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్సార్ జిల్లా (గాలివీడు): చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. గాలివీడు మండలం అరవీడు గ్రామంలో ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై పర్యటించారు. ఈ మేరకు స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేదని, కుషావతీ ప్రాజెక్టు రెండవ గేటు పనులు సరిగ్గా చేపట్టకపోవడంతో నీరంతా వృధాగా పోతుందని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే విద్యుత్‌ అధికారులను, కాంట్రాక్టర్‌ను పిలిపించి గ్రామంలో సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అనంతరం కొత్తపల్లె గ్రామంలో పర్యటించి పార్టీ యువనేత ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం
ఎమ్మెల్సీ కోలగట్ల, ఎమ్మెల్యే రాజన్నదొర

తమ్మిరాజుపేట(మెంటాడ): గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజన్నదొరలు సూచించారు. మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామంలోని పైడితల్లమ్మ జాతరకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరతో కలిసి కోలగట్ల హాజరయ్యారు.  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ మండల అధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. 

మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ పటిష్టతకు గ్రామ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలన్నారు. జిల్లా నాయకత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని  భరోసానిచ్చారు. ప్రభుత్వ అసత్వంతో జిల్లాలో ఉన్న జూటు  పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. దీంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్దున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పరిశ్రమలను తెరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు పేదలకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదని ఫైరయ్యారు. ఇళ్లు మంజూరు చేస్తామని లబ్ధిదారుల నుంచి టీడీపీ కార్యకర్తలు వేలాది రూపాయలు వసూళ్లు చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన గృహాలకు, మధ్యలో నిలిపివేసిన గృహాలకు బిల్లులు చెల్లించి వాటిని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేందుకు ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలన్నారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా జననేత జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.  ఈకార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అలుగు నిర్మాణానికి సహకరించండి
ఎమ్మెల్యే వై. ఐజయ్య
నందికొట్కూరు: రాయలసీమ వాసులందరూ రాజకీయాలకు అతీతంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి సహకరించాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య కోరారు. నందికొట్కూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు స్వచ్ఛందంగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరులోపు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముచ్చుమ్రరి ఎత్తిపోతల పథకం 30 శాతం పూర్తికాకున్నా ఆగస్టు వరకు సాగు, తాగునీరు అందిస్తామని చెబుతూ మంత్రి దేవినేని ఉమా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని ఫైరయ్యారు. అన్ని రంగాల ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిరాని పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ. 600 కోట్లు దోచుకుని చంద్రబాబు తెలుగు తముళ్ల జేబులు నింపారని ధ్వజమెత్తారు. వార్డు మెంబర్‌లుగా గెలవని వారిని బాబు జన్మభూమి కమిటీల ఇన్‌చార్జ్‌ల పేరుతో నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును టీడీపీ అబ్బసొమ్ములా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అధికార అహంకారంతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అధికారులు, ప్రతిపక్ష నాయకులపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వీటిని అరికట్టాల్సిన ముఖ్యమంత్రే దగ్గరుండి దాడులను, బెదిరింపులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి ప్రజారంజక పాలన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


బయోమెట్రిక్‌తో రైతులకు ఇబ్బందులు
వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి
అనంతపురం(మడకశిర): రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని ఉపయోగించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి అన్నారు. బయోమెట్రిక్‌ మిషన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అర్హులైన రైతులకు విత్తనాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  దీంతో విత్తనానికి వచ్చి వెనుదిరిగి పోతున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం ఇస్తున్న వేరుశనగ విత్తనం రైతులకు ఏమాత్రం సరిపోవడం లేదని, విత్తనాల పంపిణీలో నిబంధనలు లేకుండా రైతులు అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బయోమెట్రిక్‌లో విత్తనాన్ని పొందని రైతులకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విత్తనాన్ని అందించాలని ప్రభుత్వాధికారులను కోరారు. 
Back to Top