గర్జనకు మత్స్యకారుల సంఘీభావం

నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రరాష్ట్రానికి చేసిన మోసానికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు మత్స్యకారుల సంఘం సంఘీభావం తెలిపింది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు డీజిల్‌ సబ్సిడీ 50 శాతం ఇస్తామనని మోసం చేశారని, సరైన పద్ధతుల్లో డీజిల్‌ సబ్సిడీ ఇవ్వాలని, వేట నిషేద సమయంలో అందాల్సిన భృతి ఇవ్వడం లేదని, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని, పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలలు కట్టించాలని కోరారు. అదే విధంగా చంద్రబాబు మత్స్యకారులకు ఇళ్లు కట్టిస్తామని మోసం చేశాడని, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ఇళ్లు కట్టించాలని, అంతేకాకుండా వలలు, బోట్లు దెబ్బతిన్నా.. మనిషికి అపాయం జరిగినా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, మత్స్యకార సంక్షేమ సమితి భవనాలు నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 
Back to Top