వైయస్ జగన్‌ నాయకత్వంలో పోరాటం ఉధృతం

  • ⇒ఆత్మగౌరవ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన
  • ⇒సహకరించిన అందరికీ కృతజ్ఞతలు
  • ⇒విశాఖను వాడుకుంటున్న చంద్రబాబు
  • ⇒ఎంపీ అవంతి వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • ⇒వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు  గుడివాడ అమర్‌నాథ్‌  
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ) : ఐదున్నరేళ్లయినా జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించలేదంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ఎంతగా భయపడుతుందో అర్థమవుతోందని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. అన్ని ఎన్నికలు కలిపి 2019లో పెడతామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జీవీఎంసీ ఎన్నికలపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. జగదాంబ జంక్షన్‌ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. 

రైల్వేజోన్‌ సాధనలో ప్రజలను భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో అనకాపల్లి నుంచి భీమిలి వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. దాదాపు 8 నియోజకవర్గాలు, 62 వార్డులు, విలీన గ్రామ పంచాయతీల్లో ఈ యాత్ర కొనసాగిందని, అన్ని ప్రాంతాల ప్రజల  నుంచి ఈ యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. పోరాటం  ఉధృతం చేయాలని ప్రజలు కోరారని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ పోరాటానికి మద్దతు తెలిపిన వామపక్షాలు, లోక్‌సత్తా, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ తదితర అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, పలు అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖకు చంద్రబాబు చేసిందేమిటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్ల కాలంలో దాదాపు 40 సార్లుపైగానే విశాఖ వచ్చారని, ఈ ప్రాంతానికి బాబు చేసింది శూన్యమేనని ఆయనకు ఓట్లేసిన ప్రజలే చెబుతున్నారని అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబుకు విశాఖను వాడుకోవడమే తప్పా.. అభివృద్ధి చేయాలనే ఉద్దేశం లేదన్నారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, సింహాచలం భూ సమస్య, రోడ్డున పడిన తగరపువలస జ్యూట్‌ కార్మికులు,    తదితర సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో సమావేశాలకే విశాఖ కావాలా అంటూ మండిపడ్డారు. ఆత్మగౌరవ యాత్రపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. యాత్ర చేపట్టాల్సింది గల్లీలో కాదు.. ఢిల్లీలో అని ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రైల్వేజోన్‌ సాధన కోసం ఏం చేశారని ఎంపీని ప్రశ్నించారు. బతుకుదెరువు, రాజకీయాల కోసం ఇక్కడకు వచ్చిన వారికి విశాఖపట్నం గల్లీలాగే కనబడుతుందన్నారు.

విశాఖలో ఏ అభివృద్ధి చేయని కారణంగానే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, బొల్లవరపు జాన్‌వెస్లీ, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు శ్రీకాంత్‌రాజ్,  మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్,  ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ ఆలీ, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు బద్రీనాథ్, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధా, జిల్లా కమిటీ ప్రతినిధి సుంకరి గిరిబాబు పాల్గొన్నారు.
Back to Top