* రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ వ్యాపారం* చట్టానికి తూట్లు..!* బల ప్రయోగం చేస్తే ప్రతిఘటన విజయవాడ) రాష్ట్ర ప్రజల అందరి దృష్టి రాజధాని ప్రాంతం మీద పడింది. భూ సమీకరణ లేదంటే భూ సేకరణ దిశ గా ప్రభుత్వం దూసుకొని పోతోంది. రైతుల ముక్కు పిండి మరీ భూముల్ని లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ, నవ్వి పోదురు గాక, నాకేమి సిగ్గు అన్నట్లుగా సర్కారు వ్యవహరిస్తోంది. రాజధాని పేరుతో భూ దాహంకృష్ణా, గుంటూరు జిల్లా ల మధ్య ఏ ముహుర్తాన రాజధానిని ప్రకటించారో కానీ, అప్పటి నుంచి అక్కడ కష్టాలు మొదలయ్యాయి. మూడు పంటలు పండే పచ్చటి భూముల్ని కబళించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూ వచ్చింది. రాజధాని అంటే ఒకటి, రెండు గ్రామాల దగ్గర కొన్ని భవంతులు కట్టి, అక్కడ జన జీవనాన్ని అభివృద్ది చేస్తారు అని అనుకొన్నారు కానీ, ఊళ్లకు ఊళ్లను లాక్కొని, గ్రామస్తుల్ని తరిమేస్తారని ఊహించలేదు. భూముల సమీకరణ పేరుతో బలవంతంగా భూముల్ని లాక్కొన్నారు. భయపెట్టి చేసిన భూ సమీకరణ తో దాదాపు 30 వేల ఎకరాల దాకా లాక్కొన్న చంద్రబాబు చట్టంతో ఆటలు ఆడుకొంటున్నారు. చట్టానికి తూట్లుభూసేకరణ చట్టానికి సవరణ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీంతో ప్రస్తుతం భూ సేకరణ చట్టం 2013 మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా భావించాల్సి వస్తోంది. ఇందులో మూడు కీలకాంశాలు ఉన్నాయి. భూముల్ని సేకరించాలంటే అక్కడ సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. 70 శాతం ప్రజల ఆమోదం తీసుకోవాలి. మూడు పంటలు పండే భూముల్ని తీసుకోవాలి. ఈ మూడు అంశాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఉన్న అన్ని మార్గాల్ని వెదకుతోంది. బలవంతం చేస్తే..! ఇప్పటికే 30వేల ఎకరాలకు పైగా భూములు లాక్కొన్న ప్రభుత్వం మరిన్ని వేల ఎకరాల భూముల కోసం తహతహలాడుతోంది. రైతుల్ని భయ భ్రాంతులకు గురి చేసి భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. మూడు పంటలు పండే భూముల్ని లాక్కోవటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో హితవు చెబుతున్నా ప్రభుత్వానికి చెవికి ఎక్కటం లేదు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతంగా భూములు లాక్కొనేందుకే తాము వ్యతిరేకమని వైఎస్సార్ సీపీ చెబుతోంది. బలవంతంగా భూముల్ని లాక్కొంటే ప్రతిఘటిస్తామని చెబుతోంది.