ప్రజల కోసమే పోరాటం

తమది పోరాడేతత్వం..జేసీది పారిపోయే తత్వం
టీడీపీ మోసం వల్లే రైతు, చేనేతల ఆత్మహత్యలు
ఇచ్చిన మాట ప్రకారం జననేత పరామర్శ
రైతుల కుటుంబాల్లో భరోసా
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి

అనంతపురం: ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల కోసమే పోరాటం చేస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా యాడికిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు... మాట తప్పడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 రైతు, చేనేతల ఆత్మహత్యలపై ప్రధాని, ముఖ్యమంత్రి స్పందించకపోతే ....ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఐదు విడతలుగా జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. యాత్రలో భాగంగా ఏ ఊరు వెళ్లినా..ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని..చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారన్నారు. 

ప్రజల ఆక్రోషాన్ని వైయస్‌ జగన్‌ బహిరంగంగా వెల్లడించారని తెలిపారు. రైతుల్లో భరోసా కల్పించి వారికి అండగా ఉండేందుకు వైయస్‌ జగన్‌ జిల్లాకు వచ్చారని చెప్పారు.  టీడీపీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటామన్నారు. మాకు డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు అవసరం లేదని స్పష్టం చేశారు. నాడు పరిటాల రవీంద్రకు భయపడి బెంగుళూరుకు పారిపోయిన చరిత్ర జేసీ దివాకర్‌రెడ్డి సోదరులదని గుర్తు చేశారు.

Back to Top