కౌన్సిల్‌ సమావేశంలో తోపులాట

మచిలీపట్నం టౌన్ : మున్సిపల్‌ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. ప్రతిపక్ష వైయస్సార్‌ సీపీ సభ్యులను అధికార టీడీపీ నాయకులు తోసుకుంటూ వెళ్లటంతో గురువారం నాటి కౌన్సిల్‌ సభలో గందరగోళ పరిస్ధితి నెలకొది. సభ్యులు ఎవరికి వారు నీవెంత అంటే నీవెంత అంటూ చూసుకుందాం అంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగారు. ఒకానొక దశలో సభలో అసలు ఏం జరుగుతుందో అర్ధంకాని స్ధితి నెలకొంది. చైర్మన్‌ టేబుల్‌పై ఉన్న గ్లాస్‌ను పెనుగులాట నడుమ వైస్‌చైర్మన్‌ పి. కాశీవిశ్వనాధం పడేయగా దీనిలోని నీళ్లు ఒలికిపోయాయి. దీన్ని సాకుగా చూపి అధికార పక్ష సభ్యులు ఈ గ్లాస్‌ను ప్రతిపక్ష సభ్యుడు మేకల సుబ్బన్నే పడేశాడని ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రతిపాదించారు. ఈ డిమాండ్‌తో సభలో మరింత గందరగోళం చోటు చేసుకుంది. ఈ దశలో కోపోద్రిక్తుడైన వైస్‌చైర్మన్‌ తన ముందున్న బల్లపై గట్టిగా కొట్టడంతో ఆయన గ్లాసు కూడా ఎగిరిపడి నీరు ఒలికాయి. చైర్మన్‌ గ్లాస్‌ పడటానికి కారణం తానేనని సస్పెండ్‌ చేశారని, మరి సభా మర్యాదను పాటించని వైస్‌చైర్మన్‌ను కూడా ఎందుకు సస్పెండ్‌ చేయరని ప్రతిపక్ష సభ్యుడు సుబ్బన్న చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సమావేశాన్ని ప్రారంభించిన చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ దశలోనే మున్సిపల్‌ పాఠశాలల్లో టెన్త్‌ ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని, పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. ఈ దశలో మున్సిపల్‌ పాఠశాలలు మీరు చెప్పినట్లు కాకుండా వసతులు లేక ఎంతో దయనీయ స్ధితిలో ఉన్నాయరని, తాగేందుకు, వంట చేసేందుకు తాగునీరు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, చేతి పంపులు దెబ్బతిన్నా మరమ్మతులు కూడా చేయటం లేదని ప్రతిపక్ష నాయకుడు షేక్‌ అచ్చేబా పేర్కొన్నారు. ఈ దశలో చైర్మన్‌కు అచ్చేబాకు మద్య వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భంలో నువ్వు కూర్చో అని చైర్మన్‌ అచ్చేబాను హెచ్చరించారు. దీంతో సమస్యపై మాట్లాడుతున్న తనను ఎలా కూర్చోమంటారు.. అంటూ అచ్చేబా చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ దశలో సుబ్బన్న లేచి సమస్యపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుండగా మద్యలో కూర్చోమనటం ఎంతవరకూ సబబు అని చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ సమయంలోనే అధికార పక్ష సభ్యుడు నారగాని ఆంజనేయప్రసాద్‌ కలుగజేసుకుని సుబ్బన్నతో వాగ్వాదానికి దిగారు. సుబ్బన్నపై నారగాని, చైర్మన్‌లు ఎదురుదాడికి పాల్పడుతుండటంతో సుబ్బన్న, అచ్చేబాలు చైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి చైర్మన్‌ను ప్రశ్నించసాగారు. దీంతో ఫ్లోర్‌ లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం, వైస్‌చైర్మన్‌ పి. కాశీవిశ్వనాధం, నారగాని, బత్తిన దాసు ఇతర టీడీపీ సభ్యులు అక్కడకు చేరుకుని సుబ్బన్న, అచ్చేబాను పక్కకు తోసేశారు. ఈ దశలో సుబ్రహ్మణ్యం ప్రతిపక్ష సభ్యుడైన సుబ్బన్నను నీ అంతు చూస్తాం.. రా చూసుకుందాం.. అంటూ ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు.

Back to Top