దుర్మార్గపు పాలనపై ధర్మయుద్ధం

  • ప్రజల పక్షాన వైయస్ జగన్ అలుపెరగని పోరాటం
  • రాజధానిలో టీడీపీ బలవంతపు భూసేకరణపై ఆగ్రహం
  • రైతన్నకు అండగా 19న రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష నేత పర్యటన
  • ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు 
  • కిడ్నీ బాధితులకు బాసటగా 20న ప్రకాశం జిల్లాలో పర్యటన
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దుర్మార్గపు పాలనపై ధర్మయుద్ధం చేస్తున్నారు.  ప్రజాసమస్యలు గాలికొదిలేసి, రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ పై  ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దోపిడీ సర్కార్ చేతిలో వంచనకు గురైన ప్రతీ ఒక్కరికీ అండగా నిలుస్తూ న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఈక్రమంలోనే జనంలో ఒకడిగా అలసట లేకుండా తిరుగుతూ వారి సాధక బాధలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రజానీకమంతా వైయస్ జగన్ వెంట నడుస్తూ మోసపూరిత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నెల 19న రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు.  సీఆర్‌డీఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులు 33 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌కు (సమీకరణకు) ఇచ్చారని ప్రభుత్వమే ప్రకటించింది. త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చకపోగా...పూలింగ్‌కు ఇవ్వకుండా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల వద్ద మిగిలి ఉన్న భూములను కూడా ఇప్పుడు భూసేకరణ పేరిట లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. సీఆర్‌డీఏ పరిధిలో బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం రాజధాని ప్రాంత పర్యటనకు వెళ్తున్నారు. బాధిత రైతాంగంతో వైయస్ జగన్ ముఖాముఖి మాట్లాడతారు. 

అదేవిధంగా ఈనెల 20వ తేదీ ప్రకాశం జిల్లా కనిగిరి,పోలవరం, పిసీ మండల ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇటీవల కనిగిరి నియోజకవర్గానికి చెందిన కిడ్నీ బాధితులు లోటస్ పాండ్ లో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను కలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కోసారి రూ. 4వేలు ఖర్చవుతోందని, ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదని వాపోయారు. ఈనేపథ్యంలో వైయస్ జగన్ వారికి అండగా నిలిచారు.  20న కనిగిరిలో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనడానికి కిడ్నీ బాధితులే ఉదాహరణ అని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడం కారణంగా జిల్లాలో 424 మంది చనిపోయారని తెలిపారు.
Back to Top