రాజోలిబండ ఆనకట్ట నిర్మించాలి

దువ్వూరు నుంచి కడప కలెక్టరేట్‌కు 500 ట్రాక్టర్‌లతో ర్యాలీ
కలెక్టరేట్‌ ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా
రేపటి పర్యటనలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి
రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరించబడాలంటే రాజోలిబండ ఆనకట్టు నిర్మాణం చేపట్టాలని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజోలిబండ ఆనకట్ట కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరుబాట నిర్వహించింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు నుంచి కడప కలెక్టరేట్‌ వరకు 500ల ట్రాక్టర్‌లతో ర్యాలీ చేపట్టారు. ట్రాక్టర్ల ర్యాలీలో వైయస్‌ అవినాష్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజోలిబండ ఆనకట్టు నిర్మాణంతో రెండు పంటలకు నీరు అందడంతో పాటు మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాలే కాకుండా కడప కార్పొరేషన్‌కు తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. కడపలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని, అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తున్నాయని, అదే రాజోలిబండ ఆనకట్టు నిర్మిస్తే తాగునీటి సమస్య కూడా తీరుతుందన్నారు. 
వైయస్‌ఆర్‌ సాహసోపేత నిర్ణయం..
దివంగత మహానేత ఐయస్‌ రాజశేఖరరెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకొని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ చేపట్టారని వైయస్‌ అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు. గతంలో 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే బనికిచెర్ల నుంచి వెలుగోడుకు వచ్చేవని, వైయస్‌ఆర్‌ నిర్ణయంతో రోజుకు ఒక టీఎంసీ నీరు పోతిరెడ్డిపాడుకు వస్తుందన్నారు. కనీసం రేపటి పర్యటనలోనైనా రాజోలిబండ ఆనకట్టు నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసి కడప కార్పొరేషన్‌ ప్రజానికాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 
మంత్రి పట్టించుకోవడం లేదు..
పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని మంత్రికి ఎన్నిసార్లు వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడం లేదని వైయస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు 0 నుంచి 18 కిలోమీటర్‌ వరకు పనులు పూర్తి చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంత్రిని అనేకసార్లు కలిశారన్నారు. మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుందన్నారు. ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు కూడా పూర్తి చేయాలని, వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు కనీసం 5 వేల క్యూసెక్కుల నీరు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top