సంక్షోభంలో రాయలసీమ రైతాంగం

  • కరువుతో అల్లాడుతున్న అన్నదాత
  • పొట్టచేత పట్టుకొని వలసలు పోతున్న దుస్థితి
  • చోద్యం చూస్తోన్న సర్కార్
  • రైతులను ఆదుకోవాలని వైయస్సార్సీపీ డిమాండ్
వైయస్ఆర్ జిల్లాః గత మూడేళ్లుగా రాయలసీమ రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోదని వైయస్సార్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. 2014-15కు సంబంధించి 155 మండలాలు, 15-16లో 212 మండలాలు, ఈ సంవత్సరం 154 మండలాలను ప్రభుత్వమే కరువుమండలాలుగా ప్రకటించిందని అన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాయలసీమ మొత్తంమీద 2,500 కోట్ల రూపాయలు రైతాంగం పెట్టుబడులు నష్టపోయినట్లు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్ఆర్ జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన రాయలసీమ రైతు విభాగం కార్యవర్గ సమావేశంలో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,  వైయస్సార్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డితో పాటు పలువురు రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. 

రైతులు వేల కోట్లు నష్టపోతుంటే జిల్లాకు రూ. 50 కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దారుణమని నాగిరెడ్డి మండిపడ్డారు. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలులో వర్షాపాతం లేక, రబీ పంట సాగుకాక రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. లక్షలాది మంది ప్రజలు పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, గతంలోని బకాయిలు, ఇన్ పుట్ సబ్సిడి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.500, 1000 నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను, బంగారు రుణాలను చెల్లించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
Back to Top