అమరావతి ప్రాజెక్ట్ పై ప్రపంచబ్యాంకుకు రైతుల ఫిర్యాదు

అమరావతి: అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు (ఐడీ: పీ 159808)ను మరోసారి పునఃపరిశీలించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు చేసిన ఫిర్యాదును ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంది. రాజధాని రైతులు ఫిర్యాదు నమోదు చేసినట్టు ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కార్యాలయం నుంచి సందేశం అందింది. దాదాపు 13 పేజీల ఫిర్యాదును రైతులు పంపారు. అమరావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే ముందు తాము చేసిన ఫిర్యాదులను పరిశీలించాలని కోరారు.

ప్రపంచ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు సాగుతోందని వివరించారు. తాము తమ సొంత భూమిని వదులుకోవాల్సి వస్తోందని, తమ ఇష్టానికి వ్యతిరేకంగా భూముల్ని తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అనేకసార్లు తాము ప్రపంచ బ్యాంకుకు ఈ విషయాల్ని చెప్పినప్పటికీ పట్టించుకోనందున తనిఖీ బృందానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పునరావాసం పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలను ప్రస్తావించారు.
Back to Top