రెండేళ్లలో రైతు ప్రభుత్వం

  • బాబు సీఎం అయ్యారు..వరుసగా కరువులొచ్చాయి
  • మూడేళ్లలో టీడీపీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు
  • బాబుకు కాంట్రాక్టర్లపైనే ప్రేమ
  • నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి
  • మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
  • దోర్నాలలో మహానేత విగ్రహానికి వైయస్‌ జగన్‌ నివాళి
దోర్నాల: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా కట్టలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  మండిపడ్డారు. బాబు సీఎం అయ్యాక...రాష్ట్రంలో వరుసగా కరువులొచ్చాయని ఎద్దేవా చేశారు. మరో రెండేళ్లలో రైతు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం శ్రీశైలం నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరుకు వెళ్తూ మార్గమధ్యలో ప్రకాశం జిల్లా దోర్నాల ప్రధాన కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడివచ్చిన ప్రజలనుద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఇవాళ రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేల అడుగుల లోతులో బోర్లు వేసినా ఫలితం దక్కడం లేదన్నారు. చంద్రబాబు సీఎం అయ్యి మూడేళ్లు అవుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని తప్పుపట్టారు. ఆయన సీఎం అయ్యాక వరుసగా మూడేళ్లు కరువు వచ్చిందన్నారు. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత వాసులను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మహానేత మరణాంతరం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాథుడు లేడన్నారు. చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ నిధులు ఏ మూలకు చాలవని, ఆ నిధులతో ప్రాజెక్ట్‌ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. హెడ్‌ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకూ ప్రారంభించనే లేదని ధ్వజమెత్తారు.

బాబుకు డబ్బు పిచ్చి
సీఎం చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టిందని వైయస్‌ జగన్‌ ఆరోపించారు.  రైతులపై కాకుండా చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందని, డబ్బు...డబ్బు...డబ్బు... తప్ప చంద్రబాబుకు ఏమీ అవసరం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ’మూడేళ్ల పాలన పూర్తయిందని, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, అ తర్వాత కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది.  మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి
నాయకుడు అనే వ్యక్తి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను లాక్కొని సీఎం కావాలనుకోవడం ముర్ఖత్వమే అవుతుందన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్నవారు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారు రాజీనామా చేయాలన్నారు. లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో 42 లక్షల ఇళ్లు నిర్మిస్తే...చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి‡ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో మహానేత వైయస్‌ఆర్‌తో పాటు తన ఫోటో పెట్టుకునేలా చేస్తానని వైయస్‌ జగన్‌ చెప్పారు. వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాలని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని ఆయన కోరారు. 

Back to Top