వైయస్ జగన్ ను ఎదుర్కొనే దమ్ములేకనే

  • వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం
  •  సీమ ప్రజలందరిని రౌడీలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
  • నష్టపోయిన మినుము రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ, సత్తా లేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు.  సమస్యలపై ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించే విష సంస్కృతిని ఆపాలని టీడీపీ నేతలకు సూచించారు. వైయస్‌ జగన్‌ కృష్టా జిల్లాలో ఇటీవల పర్యటించిన సందర్భంగా ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని పార్థసారధి తప్పుపట్టారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పార్థసారధి ఏమన్నారంటే..

అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులతో కాలం గడుపుతూ..సమస్యలు ఏమీ లేనట్లు అభూత కల్పనగా సృష్టించి పబ్బం గడుపుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం, సత్తా లేక, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిగానీ, తమ పరిపాలన పట్ల టీడీపీ నేతలకు నమ్మకం లేదు. వైయస్‌ జగన్‌ వెళ్లిన ప్రాంతానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యే వెళ్లి ఇదిగో పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయని చూపించే సత్తా లేదు. కానుగోలు, నాగులపట్నం ప్రాంతంలో ఐదు బస్తాల మినులు పండించామని చూపించండి చాలూ. అలాంటి చాలెంజ్‌ చేసి రాజకీయాలు చేయాలి. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకూడదని ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించే విష సంస్కృతికి తెరలేపితే బయపడే ప్రసక్తే లేదు. మినుము పంట వైరస్‌ కృష్ణా జిల్లా ఒక్కటే కాదు..రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కాపు లేకపోవడంతో మినుము పంట కోసేందుకు కూడా డబ్బులు లేక గొ్రరెలు మేపేందుకు వదిలివేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ వైరస్‌ను ఎలా నిర్మూలించాలని వెంటనే శాస్త్రవేత్తలను రంగంలోకి దించాల్సింది పోయి ప్రతిపక్ష నేతపై ఎదురుదాడికి దిగడం బాధాకరం. ఎంత ఖర్చు చేసినా పంటను కాపాడుకునే పరిస్థితులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే..వ్యవసాయ మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆసరాగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతులను నిందించే కార్యక్రమం చేపట్టడం దారుణం. వైయస్‌ జగన్‌ అబద్ధాలు చెబుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు..ఇలాంటి విష సంస్కృతిని మీరు ఆపండి. సీఎం నోరు తెరిస్తే చాలు రాయలసీమ రౌడీలను కించపరుస్తున్నారు. మీది రాయలసీమ కాదా?. ఆయన కూడా రౌడీనేనా? రాయలసీమ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్‌భాగం కాదా? సీమ ప్రజలందరిని రౌడీలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారా?. కోస్తా, రాయలసీమ అంటూ వైరుద్యం సృష్టిస్తున్నారు. సీమలో శాంతిని కోరుకోవడం లేదా? టీడీపీ నేతల తీరు చాలా తప్పు. మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.ఇప్పటికైనా సరే మినుము సాగు చేసిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. మీకు మానవత్వం ఉంటే..మీది రైతు ప్రభుత్వమైతే మినుము రైతుల సమస్యలను పరిష్కరించే మార్గాలు ఆన్వేషించాలి. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు మినుము పంటకు ఇన్సూరెన్సు చెల్లించినా జాబితాలో పేర్లు లేకుండా తొలగిస్తున్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎవరూ ఇబ్బందుల్లో ఉన్నా మేం పోరాడుతూనే ఉంటాం. పోలీసు డిపార్టుమెంట్‌ ఈ రోజు కళ్లకు గంతలు కట్టుకొని పనిచేస్తోంది.
Back to Top