రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ పరిపాలన

అనంతపురంః సాక్షి టీవీ ప్రసారాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వైయస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్న సాక్షి టీవీ ప్రసారాలను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి చంద్రబాబు వ్యవహార శైలే కారణమని గుర్నాథరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ఫ్యాక్షనిస్టు పరిపాలన చేస్తున్నందునే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగడం లేదని గుర్నాథరెడ్డి అన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే వాటిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాబు పరిపాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. చంద్రబాబు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రెండ్రోజుల్లోగా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఎమ్మెఎస్ వోలను డిమాండ్ చేశారు. కాదని మొండి వైఖరి అవలంభిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  ఇప్పటికైనా బాబు ఫ్యాక్షనిస్ట్ వైఖరి మార్చుకొని ప్రజాపరిపాలన చేయాలన్నారు. 
Back to Top