వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని సమర్ధించేందుకే పార్టీలో చేరా


చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని సమర్థించేందుకే తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఇవాళ రవిబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రమైన వైఫల్యాలను ఎదుర్కొంటుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలన్నారు. ఏ స్ఫూర్తితో పేదరికాన్ని తొలగించాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి భావించారో అదే స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ ప్రజల కోసం తిరుగుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు ఇవాళ వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ బలమైన నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచనతోనే తాను వైయస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు.  
 
Back to Top