'దాచుకోవడానికే బాబు అమెరికా యాత్ర'

విజయవాడ :

దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అమెరికా యాత్రకు వెళ్లారని తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. కేంద్రంలో విదేశీ పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు వ్యతిరేకంగా పార్లమెంటులో పెట్టిన తీర్మానానికి ముగ్గురు ఎంపిలను ఓటు వేయకుండా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని రమేష్‌ ఆరోపించారు. ఎఫ్‌డిఐలపై అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారీగా ముడుపులు ముట్టాయని జోగి రమేష్‌ అన్నారు. ఆ డబ్బును, మహానాడులో చందాలుగా వచ్చిన దాన్ని దాచుకోవడానికి చంద్రబాబు విదేశీ యాత్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

ఇక రాష్ట్రానికి వస్తే.. అవిశ్వాస తీర్మానం సమయంలో అసెంబ్లీ ముఖం చూడకుండా పాదయాత్ర నెపంతో ఊళ్ళ వెంట తిరుగుతూ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని రమేష్ దుయ్యబట్టారు. ‌ఇప్పుడు కూడా అసెంబ్లీ బడ్జెట్‌ రెండవ విడత సమావేశాలు జరుగుతుంటే కూడా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకుండా విదేశాలకు వెళ్లడంలో చంద్రబాబు ఆంతర్యం ఏమిటని చంద్రబాబును జోగి రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా ఇలాంటి నీతిమాలిన, ప్రజలను వంఛించిన నాయకుడు లేడని, ఇక ముందు కూడా పుట్టబోరని‌ చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Back to Top