ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించరా?

హైదరాబాద్ : రైతులకు అందించాల్సిన పంటనష్టపరిహారాన్ని అందజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా రైతులతో కలిసి హైదరాబాద్‌ ఏఐసీ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆయన బైఠాయించారు. రైతులకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2011 నుంచి ఇప్పటి వరకు రైతులకు పంట పరిహారం బకాయిలుగా మిగిలిపోయాయని, పంటల వారిగా నివేదిక కూడా తీసుకొచ్చామన్నారు. వీటితో పాటు వాతావరణ మర్పులతో నష్టపోయిన అరటి తోటల పరిహారం కూడా పెండింగ్‌లో ఉందన్నారు. రైతు బీమా చెల్లిస్తే పంట నష్టపోయిన తరువాత ఆరు నెలల్లో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్‌ కంపెనీలపై ఉందన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా.. న్యాయంగా రైతులకు రావాల్సిన పరిహారం ఇవ్వాల్టికి జమ కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతోనే ఇనూరెన్స్‌ కంపెనీ అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. చిన్న చిన్న కారణాలు చూపకుండా సత్వరమే పరిహారం రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top