ఆనం గెలుపు బాధ్యత అందరిది

నెల్లూరు: స్థానిక సంస్థల శాసన మండలి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి గెలుపు బాధ్యత పార్టీ ప్రజాప్రతినిధులందరిపై ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అలాగే పీడీఎఫ్‌ బలపరచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు యడపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యంలకు వైయస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆయన తెలిపారు. నార్తురాజుపాలెంలోని వీసీఆర్‌ అతిధిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులంతా వీరిద్దరి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైయస్‌ఆర్‌సీపీ తరుపున జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఆనం విజయకుమార్‌రెడ్డిని గెలుపించుకోవల్సిన బాధ్యత పార్టీ కేడర్‌పై ఉందన్నారు. పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లంతా ఐక్యంగా ఉండి అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొని విజయకుమార్‌రెడ్డికి ఓటు వేయాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచిన స్ధానిక సంస్ధల ప్రతినిధుల్లో కొందరు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి ఉన్నారని, వారంతా మనసాక్షికి కట్టుబడి పార్టీ బలపరచిన ఆనంకు ఓటు వేసి గెలిపించాలన్నారు.   సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, మండల కన్వీనర్‌ గంధం వెంకటశేషయ్య, వైస్‌ ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్‌ నాగిరెడ్డి రమేష్, నాయకులు ఇసనాక సునీల్‌రెడ్డి, బాలశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top