ఎన్‌వీఎస్‌ఎస్ మాటల వెనుక టీడీపీ: జూపూడి


హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌ల మీద బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు ఆ పార్టీ పతనావస్థకు, దిగజారుడుకు సూచికలుగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతున్న సమయంలో ప్రజల గుండెల్లో ఉన్న నాయకుల మీద ఏదో ఒక రకంగా బురద చల్లే టీడీపీ వ్యూహయంలో బీజేపీ నేత ఓ పావుగా ఉపయోగపడుతున్నారని విమర్శించారు.

     మహానేత మరణానంతరం మూడున్నరేళ్లకు బీజేపీ నేత ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. మహానేత కుటుంబం మీద టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఎలాగూ నమ్మటం లేదని గమనించే బీజేపీ నేత రంగంలోకి దిగినట్టు కినిపిస్తోందన్నారు. ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుడని తెలిసినా, అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని ఎలాంటి దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పల్లెత్తు మాట అనకపోవటం కూడా మహానేత వ్యతిరేక బృందం బాణీలకు చిందులు వేస్తున్న వైనాన్ని వెల్లడిస్తోందన్నారు.

     శ్రీమతి షర్మిల, బ్రదర్ అనిల్‌లకు సంబంధించిన కంపెనీల లావాదేవీలు రహస్యం కాదని, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎవరికైనా వివరాలు అందుబాటులో ఉంటాయని జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆయా సంస్థల వివరాలు వెల్లడించిన తీరు బీజేపీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని, టీడీపీ-బీజేపీల బంధాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉందన్నారు. బ్రదర్ అనిల్ మతాన్ని కూడా కించపరిచేలా మాట్లాడటం ద్వారా బీజేపీ నేత తన రాజకీయ ఎజెండాను కూడా వెల్లడించారని అన్నారు.  వందల కోట్లు అక్రమంగా తీసుకు వచ్చారని పనికి మాలిన ఆరోపణలు చేసే బదులు, ఆ వందల కోట్టేవో వెల్లడించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

     శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని తొమ్మిది నెలలుగా అక్రమంగా నిర్బంధించారని, సీబీఐ కేసును కాంగ్రెస్-టీడీపీ సంయుక్తంగా నడుపుతున్నాయని జూపూడి ఆరోపించారు. శ్రీ జగన్మోహనరెడ్డి  మీద పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమని బీబేపీ అత్యన్నత నాయకురాలు సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

Back to Top