సీఎం చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయండి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇటీవల నంద్యాలలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకుంటే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరించడంపై వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దీనిని వాయోలేషన్‌ ఓత్‌ ఆఫ్‌ ఆఫీసు కింద పరిగణించి సీఎంపై కేసు నమోదు చేయాలని శనివారం వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ..టీడీపీ ఓట్లు వేయకుంటే రేషన్,పెన్షన్లను రద్దు చేస్తానని చెప్పడం దారుణమన్నారు. రోడ్లపై నడవనీవ్వనని బెదిరించే ధోరణిలో మాట్లాడడం తగదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.5 వేలతో ఒక్క ఓటును కొనగలిగే సత్తా ఉందని ప్రకటించడం ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందకు వస్తుందన్నారు. వెంటనే ఎన్నికల కమిషన్‌ సీఎం వ్యాఖ్యాలను పరగణలోకి తీసుకొని ఆయన శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును కర్నూలు మూడో పట్టణ పోలీసులు స్వీకరించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వందలాది మంది వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వగా ఎస్‌ఐ వై.రాముడు స్వీకరించారు. కేసు నమోదు చేసినట్లు రసీదు ఇవ్వాలని వారు కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అయితే సీఎంపై కేసు నమోదు చేస్తారాలేదా అన్న విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయకుంటే ఆందోళనలు చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. పోలీసులు కేసు పెట్టే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీవై రామయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు టీవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి తోట కృష్ణారెడ్డి, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, కటారి శ్రీనివాస్, ఉమాదేవి, సాంబ, భాస్కరరెడ్డి తదిరులు పాల్గొన్నారు.

Back to Top