ఎన్ కౌంటర్ పై విచారణ జరగాలిః వాసిరెడ్డి పద్మ


  • తీవ్రవాదానికి వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం
  • ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలి
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌

హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌కౌంటర్‌పై ప్రజా సంఘాలు, ప్రజలు, మీడియా వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ఆమె లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పోరాటాలు శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలనేది పార్టీ అభిప్రాయమని చెప్పారు. మల్కాన్‌గిరి, బలిమిలా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై గత నాలుగు రోజులుగా మీడియా అనేక అనుమానాలను వ్యక్త పరుస్తుందన్నారు. మావోయిస్టులను పథకం ప్రకారమే చంపారని, నిజంగా ఎన్‌కౌంటర్‌ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. దీనిపై ఏపీ డీజీపీ సాంబశివరావు ఖ‌చ్చితంగా  ఎన్‌కౌంటర్‌ అని చెబుతున్నారు గానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంఘాలు, ప్రజలు, మీడియా కోరుతున్నట్లుగా ఎన్‌కౌంటర్‌పై నిస్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తుల ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు. చట్టంతో,  రాజ్యాంగంతో సంబంధంలేని హింసకు ప్రభుత్వం తావివ్వొద్దని వైయస్‌ఆర్‌ సీపీ కోరుతున్నట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని చంద్రబాబు అనుకూల మీడియా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నిజమైన ఎన్‌కౌంటర్‌ అయితే ప్రభుత్వం ఎందుకు నిర్భయంగా చెప్పడం లేదని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ప్రజలు, మీడియా అనుమానాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top