'ఐఎంజి భూముల కుంభకోణంపై విచారణ తథ్యం'

తిరుపతి : ‌

చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన ఐఎంజి భూముల కేటాయింపు అక్రమాలపై విచారణ చేపడతామని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి రాగానే ‌ఈ చర్య తీసుకుంటామని ఆయన తిరుపతిలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఐఎంజికి అక్రమంగా భూముల కట్టబెట్టేసినందువల్లే విచారణకు టిడిపి వెనకడుగు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఐఎంజి అక్రమాలపై విచారణ జరిగితే, చంద్రబాబు నాయుడి బండారం బయటపడుతుందని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారని చెప్పారు.

ఐఎంజి భూముల కుంభకోణంపై పిటిషన్ దాఖలు చేసిన వారిలో తనతో పాటు, మాజీ మంత్రి ‌డి‌.ఎల్. రవీంద్రారెడ్డి కూడా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.‌ చంద్రబాబుకు ధైర్యం ఉంటే విచారణకు ముందుకు వచ్చి, తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు విచారణకు  అందకపోయినా, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎం‌జిపై తప్పకుండా విచారణ చేపడతామని ఆయన హెచ్చరించారు.

Back to Top