ఎన్నికల్లో కాంగ్రెస్ సహ'కారం'


హైదరాబాద్, 1 ఫిబ్రవరి 2013:

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు తారాస్థాయికి చేరాయని వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత మేకతోటి సుచరిత విమర్శించారు. సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నబైక్ మీద కూర్చొని మంత్రి ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు అందుకు నిదర్శనమన్నారు. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అధికార కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుయుక్తులు పన్నుతోందన్నారు.

      వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేని మంత్రి ఒకరు తమ పార్టీ జేండా ఉన్న బైక్ మీద కూర్చోవడం రెండు పార్టీల కుట్రలో భాగమేనని మండి పడ్డారు. గత మూడేళ్లుగా రెండు పార్టీలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకపోతే, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సుచరిత డిమాండ్ చేశారు. కుమ్మక్కు రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.

      సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పాలకులు పట్టించుకోవడంలేదని, ప్రభుత్వాన్ని నిదీయాల్నిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని అండగా నిలుస్తున్నారని సుచరిత ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. మాటకు కట్టుబడి ఉన్నందుకే మహానేత తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని 8 మాసాలుగా జైలులో నిర్బంధించారని, అయినా తమ నేత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అన్నారు.

     రాష్ట్రంలో సమస్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే సృష్టిస్తారని, నిరసనలు కూడా వారే చేసేటట్లుగా కుట్రలు చేస్తున్నారని మేకతోటి సుచరిత ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని డిసెంబర్ 9 ప్రకటనతో కాంగ్రెస్ అతలాకుతలం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top