ఎన్నికలంటే కాంగ్రెస్‌, టిడిపి గుండెల్లో రైళ్ళు

కర్నూలు : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి‌ పట్ల రాష్ట్ర ప్రజలు కనబరుస్తున్న అచంచలమైన అభిమానం నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటేనే అధికార, ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ధైర్యం ఉంటే, శ్రీ జగన్‌ ఫోబియా తమకు లేదనుకుంటే రాష్ట్ర శాసనసభకు తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌, టిడిపిలకు శోభా నాగిరెడ్డి సవాల్‌ చేశారు. రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మైనార్టీలో పడిన ఆయన ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందుకు రావాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సహకార సంఘం ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుతో విజయం సాధించిన డైరెక్టర్లను సోమవారం ఆమె అభినందించారు.

ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తిగా మైనార్టీలో పడిపోయిదని స్పష్టమైనా అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని చంద్రబాబు భుజానికెత్తుకుని మోస్తున్నారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను పక్కనపెట్టేసి చంద్రబాబు పాదయాత్ర చేయటం సిగ్గుచేటు అన్నారు. శ్రీ జగన్‌ ప్రభంజనం కారణంగానే ఎన్నికల కమిషన్ పరిధిలో లేని సహకార సంఘాల ఎన్నికలు మాత్రమే అధికార పార్టీ నిర్వహించిందని ఎద్దేవా చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైయస్‌ఆర్‌సిపికి బలం ఉన్న చోట్ల ఎన్నికలు నిర్వహించకుండా స్టే తీసుకొచ్చారన్నారు.

ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో మొదటి విడతలో ఎనిమిది సహకార సంఘాలకు ఎన్నికలు జరిగితే వాటిలో ఏడు చోట్ల వైయస్‌ఆర్‌సిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థులనే ఓటర్లు గెలిపించారని శోభా నాగిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రెండవ విడత ఎన్నికలు జరగనున్న ఐదు సంఘాల్లో కూడా పార్టీ మద్దతుదారులే భారీ స్థాయి విజయాలు నమోదే చేస్తారని తెలిసి కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిలిపివేయించారని ఆరోపించారు. ఎన్నికలు నిలిచిన స్థానాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్నింటినీ తమ పార్టీ మద్దతుదారులే గెలుస్తారని శోభా నాగిరెడ్డి ధీమాగా చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top