వాడుకునేందుకే ఉద్యోగులు..!

ఉన్నపలంగా వచ్చేయమనండపై ఆగ్రహం..!
స్వార్థప్రయోజనాల కోసమేనంటున్న ఉద్యోగులు..!

హైదరాబాద్: ఉద్యోగులను ఉన్నపలంగా ఏపీకి రావాల్సిందేనంటూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆర్భాటంపై ఎంప్లాయిస్ మండిపడుతున్నారు. విభజన ప్రక్రియ పూర్తవ్వకముందే..తెలుగుతమ్ముళ్లు తమ స్వార్థప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని హడావుడిగా తరలించడానికి ప్రయత్నించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశముండగా.. హడావుడి తరలింపు ఎందుకని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయాలు, వసతి సదుపాయాల ఏర్పాటుకు కనీస చర్యలు చేపట్టకుండానే సిబ్బందిని తీసుకెళ్లడంవల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీలేకపోగా.. కొత్త ఇబ్బందులెదురవుతాయని వారు చెబుతున్నారు.

విచ్చలవిడిగా ఖర్చెందుకు చేశారు..!
విజయవాడకు తరలిపోయానని పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబు... హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాలను ఖాళీ చేస్తారా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేదని భావించినప్పుడు.. కేవలం ఏడాదికోసం సచివాలయంలోని సీఎం కార్యాలయానికి, లేక్‌వ్యూ అతిథిగృహంలోని క్యాంపు కార్యాలయానికి....కోట్ల రూపాయల ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఎందుకు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ భవనాలకు వేసిన రంగులకు సంబంధించిన బిల్లులను ఇంకా చెల్లించనేలేదని గుర్తుచేస్తున్నారు.  ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇబ్బందులుంటే.. సీఎం విజయవాడలోనే ఉండాలని, అంతేగానీ అక్కడ కార్యాలయాలు కూడా లేకుండా ఉద్యోగుల్ని రమ్మనడంలో అర్థం లేదంటున్నారు.

రియల్ వ్యాపారం కోసమేనా..!
విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో  భారీగా సొమ్ము చేసుకునేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆపసోపాలు పడుతున్న పచ్చనేతలు...బూమ్ సృష్టించేందుకు తమను  వాడుకోవాలని చూస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీకి సర్వ హక్కులున్నాయని, పదేళ్లపాటు పాలన సాగిస్తామని చెప్పిన చంద్రబాబు..హఠాత్తుగా ఉద్యోగుల మీద పడడం వెనక ప్రయోజనాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఓటుకు కోట్లు ’ కేసు హాట్‌గా ఉన్నప్పుడు సెక్షన్-8 గురించి సీఎం ఊదరగొట్టలేదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ పాలన ఉందిగా..
ఏపీ ఉద్యోగులంతా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారన్న చందాన టీడీపీ నేతలు ప్రవర్తించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల ఉద్యోగులే హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ యుగంలో టెక్నాలజీని సమర్థంగా వాడుకుంటున్నామని, పాలనలో టెక్నాలజీ వాడకానికి పేటెంట్ రైట్ తానే అన్నట్టుగా చెప్పుకొంటున్నచంద్రబాబుకు.. ఉద్యోగులు ఎక్కడ కూర్చుంటున్నారనే విషయంతో సంబంధం లేకుండా పాలన సాగించలేరా అని నిలదీస్తున్నారు.

Back to Top