ఎల్లెడలా జనం.. పాదయాత్రలో ప్రభంజనం

మాచర్ల 27 ఫిబ్రవరి 2013:

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలానికి ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పోటెత్తినఈ ప్రభంజనంతో బస్‌స్టాండ్ సెంటర్ కిక్కిరిసిపోయింది. ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలను ఒక్కసారి చూడాలనీ, ప్రసంగాన్ని వినాలనీ అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారు. జోహార్ వైయస్‌ఆర్, జై  జగన్ అంటూ కార్యకర్తలు, నాయకులు దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద పెట్టున నినదించారు.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్, శ్రీ జగన్మోహన్‌ రెడ్డిలను అదరించిన రీతిలోనే శ్రీమతి షర్మిలకు ప్రజలు స్వాగతం పలికారు. ఆ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తమ ఇంటి ఆడపడుచు వచ్చినట్టుగా సంబరపడ్డారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం కారంపూడి మండలంలో పాదయాత్ర, రచ్చబండ కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలో ప్రసంగించారు.

     ‘నాన్న ఈ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల విలువైన పథకాలను అమలులోకి తీసుకువచ్చారు, మనసులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీ వల్ల ఆ పథకాలన్నీ నిలిచిపోయి మీరు బాధలు పడుతున్నార’ని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని తీవ్రంగా విమర్శించారు. ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. మీ కష్టాలు తీరే రోజు సమీపంలోనే ఉందనీ, అప్పటి వరకు ఓపికతో ఉండాలనీ కోరారు. రైతు బాధలను ప్రస్తావిస్తూ జగనన్న రానున్నారని కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలు, దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌పై టీడీపీ అధినేత బాబు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఆమె ప్రసంగానికి అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. స్ధానిక సమస్యలను ప్రస్తావించడంతో ఆయా వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మాచర్ల నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాల్లో మిర్చిని పండిస్తున్న రైతులకు దుర్గిలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు నాన్న ప్రయత్నం చేశారనీ, సాగునీటి కొరత రాకుండా ఎత్తిపోతల పథకాలను తెచ్చేందుకు యత్నించారనీ గుర్తు చేశారు.

ప్రసంగాలకు విశేష స్పందన
     టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై శ్రీమతి షర్మిల చేసిన ప్రసంగాలకు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో పడగొట్టకుండా చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించినప్పుడు అవునవునంటూ ప్రజలు బదులిచ్చారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా ఉన్నారని, మీ కోసం ఆయన పాదయాత్ర చేయడం లేదనీ, ఆయన కోసమే నడుస్తున్నారనీ ఎద్దేవా చేశారు.
కార్యక్రమాల్లో కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహరనాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనరు అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ జానీ బాషా, ఎస్‌టీ సెల్ జిల్లా కన్వీనర్ హనుమంత నాయక్, జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మేరుగ నాగార్జున, చిట్టావిజయభాస్కరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లతీఫ్‌రెడ్డి, యేటిగడ్డ బుజ్జి, బొమ్మారెడ్డి సునీతారెడ్డి, చీడిపూడి జయలక్ష్మి. తాళ్లపల్లి పద్మజారెడ్డి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆల్తాఫ్, ముస్తఫా, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులుపాల్గొన్నారు.

Back to Top