ఎగిసి పడిన జన కెరటాలు

గుంటూరు, 15 మార్చి 2013:

రాజన్న ముద్దుబిడ్డ, పులివెందుల ఆడబిడ్డ తమకూ ఆడబిడ్డేనని ప్రజలంతా దీవెనలందించారు. ఆమెకు ఎదురేగి పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం జనకెరటంలా సాగింది. మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో గుంటూరు జిల్లా అభివృద్ధిపై చూపిన ప్రత్యేక శ్రద్ధను పరిగణనలోకి తీసుకుని ప్రజలంతా అభిమానంతో తరలివచ్చారు. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.

మహానేతను శ్రీమతి షర్మిలలో చూసేందుకు కొందరు, తమ బాధలను చెప్పుకునేందుకు మరికొందరు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పేందుకు యజ్ఞంలా పాదయాత్రను చేస్తున్న ఆమెను ఆశీర్వదించేందుకు, అభినందించేందుకు ఇంకొందరు ఈ ప్రజాప్రస్థానానికి తరలివచ్చారు. ‘అక్కా, నిన్ను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నీతో కలిసి పాదయాత్ర చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద’ని ఒక సోదరి చెబితే, అమ్మా! దుర్మార్గపు పాలనకు తగిన బుద్ధి చెప్పండమ్మా, రాజన్న రాజ్యం వస్తే మా కష్టాలు తీరుతాయమ్మా అంటూ మరో వృద్ధుడు షర్మిలకు తమ బాధలను చెప్పుకున్నారు. అక్కడితో తమ పనై పోయిందనట్టు భావించకుండా ఆమె వెంట అడుగులో అడుగేస్తూ మద్దతు పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో పాదయాత్ర అంతా జనకెరటంలా సాగింది.

నల్లపాడు సెంటరులో జరిగిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్‌లు, సిటీ బస్‌ల్లోని ప్రజలు ఆమె ప్రసంగం వినడానికి ఆసక్తిచూపారు. బహిరంగ సభ కారణంగా నల్లపాడు రహదారిపై ట్రాఫిక్ స్తంభించినా లెక్కచేయకుండా షర్మిలను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. తాడికొండ మండలం మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ పరిధిలోని యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాలలో బస చేసిన షర్మిలను చూసేందుకు గురువారం ఉదయం అధిక సంఖ్యలో విద్యార్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. తొమ్మిది గంటలకే విద్యార్థులు బస కేంద్రానికి చేరుకున్నారు. షర్మిలతో మాట్లాడేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహపడ్డారు.


పేరేచర్ల సెంటరులోని నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై ప్రజలు బారులుతీరారు. పేరేచర్ల పెట్రోల్ బంకు సమీపంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తరువాత సాయంత్రం యాత్ర ప్రారంభమైంది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. దారిపొడవునా రహదారిపై గులాబీలతో స్వాగతం పలికారు. శ్రీనివాసకాలనీలో షర్మిల జెండా ఆవిష్కరణ చేసి నల్లపాడు సెంటరుకు తరలివెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గుంటూరు, పత్తిపాడు, మేడికొండూరు నియోజకవర్గాల ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. తొలుత జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్ నియోజకవర్గానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై బాబు అనుసరిస్తున్న విధానాన్ని దుయ్యబట్టారు.

అన్ని పార్టీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధ అవుతున్నా, బాబు ఎందుకు ముందుకు రావడం లేదో అర్ధం చేసుకోవాలని షర్మిల ప్రజలను కోరారు. అంతకు ముందు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎస్సీఎస్టీబీసీ విభాగాల కన్వీనర్లు బండారు సాయిబాబు, మేరాజోతు హనుమంత నాయక్, దేవెళ్ల రేవతి, కేంద్ర పాలక మండలి సభ్యులు రావి వెంకట రమణ, గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగ కన్వీనరు కావటి మనోహరనాయుడు, బాపట్ల, నరసరావుపేట నియోజకవర్గ నాయకులు కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, లాలుపురం రాము, చిట్టా విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top