నిర్మల్: ‘రాష్ట్రంలో ఎటు చూసినా ప్రజలు పడుతున్న కష్టాలే కనిపిస్తున్నాయనీ, ప్రజల అవస్థలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందనీ’ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పల్లెల్లో రెండు గంటలు కూడా విద్యుత్తు ఉండటంలేదనీ, విద్యుత్తు కోతలతో వేలాది పరిశ్రమలు మూతపడి, లక్షలాదిమంది ఉపాధిని కోల్పోయారనీ, విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు, ఎరువుల ధరలు పెరిగిపోయాయనీ, విత్తనాల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్ తదితరులకు శ్రీమతి విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం, వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన అమరులకు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను విజయమ్మ కట్ చేశారు. అనంతరం శ్రీమతి విజయమ్మ మాట్లాడారు. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకం విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటో అందరికీ తెలుసన్నారు. మైనార్టీలకు మహానేత డాక్టర్ వైయస్ రిజర్వేషన్లు కల్పిస్తే ఈ ప్రభుత్వం వారిని అసలే పట్టించుకోవడంలేదని తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధికి డాక్టర్ వైయస్ పెద్దపీట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన చేపట్టిన ఆరు సాగు నీటి ప్రాజెక్టులనూ ప్రస్తుత పాలకులు పట్టించుకోవడంలేదు. తెలంగాణ ప్రాంతంలో 16 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు’ అని చెప్పారు. జగన్ వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని తెలిపారు. మీ బిడ్డగా జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. 26 జీవోల విషయంలో పూటకో మాట మాట్లాడుతున్న ప్రభుత్వం ధర్మాన ప్రసాదరావు అరెస్టు విషయం వచ్చేసరికి ఆ జీవోలు సక్రమమే అంటోందని విమర్శించారు. అంతకుముందు ఇదే విషయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారన్నారు. రహేజా, ఎమ్మార్‌లకు భూములు కట్టబెట్టిన చంద్రబాబును, ల్యాంకో రాజగోపాల్ సోదరుడిని వదిలేసి.., ఏమీ లేదని తేలినా చార్జిషీట్‌ల పేరిట జగన్‌కు బెయిల్‌ను అడ్డుకుంటున్నారన్నారు.
చంద్రబాబుది అధికారం కోసం చేస్తున్న యాత్ర
‘వస్తున్నా.. మీకోసం’ పేరిట చంద్రబాబు చేస్తున్న యాత్ర ప్రజల కోసం కాదని, అధికార దాహంతో చేస్తున్నదని శ్రీమతి విజయమ్మ చెప్పారు. చంద్రబాబు యాత్ర ను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. ‘దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్, వాజ్‌పేయిలను మీరే ప్రధాన మంత్రులను చేశానంటారు. కేంద్రంలో చక్రం తిప్పానంటారు. అప్పుడు రాష్ట్ర ప్రజలకు మీరు చేసిందేమిటి’ అని చంద్రబాబును ప్రశ్నించారు. రుణమాఫీ పేరిట రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. గతంలో ఉచిత విద్యుత్తును ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్తు ఇస్తాననడం ఆయన అధికార దాహానికి నిదర్శనమని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు తెరవడానికి కారణమైన చంద్రబాబే వాటిని రద్దు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజల పక్షాన ఉండాల్సిన బాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
తెలంగాణ కోసం ఉద్యమం: ఇంద్రకరణ్ రెడ్డి
వైయస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో విలువలు, విశ్వసనీయత కరవయ్యాయని మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రజల కష్టాలను పట్టించుకోని కాం గ్రెస్‌లో ఉండలేకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, నేతలు బి.జనక్‌ప్రసాద్, గోనె ప్రకాశ్‌రావు, బాజిరెడ్డి గోవర్దన్, రెహమాన్, సూర్యప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆది శ్రీనివాస్, మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ కాంస్య విగ్రహాన్ని విజయమ్మ ఆవిష్కరించారు.