ఈ ప్రభుత్వంపై ఎవరికీ భరోసా లేదు: షర్మిల

మిర్యాలగూడ (నల్గొండజిల్లా), 16 ఫిబ్రవరి 2013: ప్రజాకంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏ వర్గానికీ భరోసా లేదని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. అయితే, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం కిరణ్‌ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. శ్రీమతి షర్మిల చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం శనివారం మధ్యాహ్నం నల్గొండజిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె తుంగపాడులో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల అక్కడకు వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌, టిడిపిలు నీచ రాజకీయాలు చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తాడని, రాజన్న రాజ్యాన్ని తెస్తాడని ఆమె భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ చంద్రబాబు ఈ ప్రజా కంటక ప్రభుత్వం అవిశ్వాసం పెట్టకుండా సాకులు చెబుతున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడిదని ఆమె నిప్పులు చెరిగారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర నేడు మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెంల మీదుగా కొనసాగుతుంది.
Back to Top