ఈ ప్రభుత్వం ఊడితేనే మేలు: షర్మిల

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా), 18 ఫిబ్రవరి 2013: ప్రజల కష్టాలు, కన్నీళ్ళను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండే కంటే ఊడిపోతేనే మేలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మహిళలకు పెద్దపీట వేశారన్నారు. వంట గ్యాస్‌ ధరను చంద్రబాబు రెట్టింపు చేశారని, ఆధార్‌తో లింకు పెట్టి వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వకుండా తప్పించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని ఆమె దుయ్యబట్టారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 70వ రోజు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఈదులగూడెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆమె గూడూరులో నిర్వహించిన రచ్చబండలో గ్రామస్థులతో ముఖాముఖీగా ముచ్చటించారు.

మహిళలంటే మహానేత వైయస్‌కు ఎంతో అభిమానం కనుకే వారి పేరు మీదనే ఇళ్ళు కట్టించి ఇచ్చారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల ఇళ్ళు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత మహానేతదే అన్నారు. మహిళలు కష్టపడకూడదనే ఆయన వంటగ్యాస్‌ ధరను పెరగనివ్వలేదన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం గ్యాస్‌ ధరను రెట్టింపు చేశారని అన్నారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీకి ఆధార్‌ నెంబర్‌తో లింకు పెట్టి వినియోగదారులను దారుణంగా దగా చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు.

రైతుల శ్రేయస్సు కోరిన వైయస్‌ ఉచిత విద్యుత్‌ను ఇచ్చారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఈ కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు కూడా రైతులకు లక్షల రూపాయల్లో బిల్లులు పంపించి వేధిస్తోందని నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ఆశీర్వదించండని రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శ్రీమతి షర్మిల నేటి పాదయాత్రలో వైయస్ అభిమానులు‌ వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శ్రీమతి షర్మిల సోమవారం మొత్తం 13.3 కిలో మీటర్లు నడుస్తారు. కొండ్రపోలు కాల్వ దగ్గర షర్మిల మరో ప్రజా ప్రస్థానం వెయ్యి కిలో మీటర్లు చేరుకుంటుంది.

తాజా వీడియోలు

Back to Top