ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా?

శీలపాడు (గుంటూరుజిల్లా), 17 మార్చి 2013: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నైతికంగా పరిపాలించే అర్హత ఉందా? అనే విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిలదీశారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం‌ నైతికంగా విశ్వసనీయత కోల్పోయిందని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆదివారంనాడు పాల్గొన్న ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారంనాడు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

గురువారంనాటి అవిశ్వాస తీర్మానంలో 142 మంది సభ్యులు మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు పలికిన వైనాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు. ఈ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీలో ఉండాలంటే కనీసం 147 మంది సభ్యుల మద్దతు ఉండాల్సి ఉంది. కాగా, టిడిపి బలం 92 నుంచి 77కు దిగజారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి కూడా అవిశ్వాసంపై ఓటింగ్‌లో పాల్గొని ఉంటే సగం మంది సభ్యులు ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసేవారని ఉమ్మారెడ్డి అన్నారు.
Back to Top